Trinethram News : ముంబయి:
ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్ లోన్ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రుణ పోర్ట్‌ఫోలియోపైనా, రుణ రికవరీపైనా ఎలాంటి ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది.
2023 మార్చి 31న నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ తనిఖీల్లో కంపెనీ గోల్డ్‌లోన్ విభాగంలో కొన్ని లోపాలు బయటపడ్డాయని ఆర్‌బీఐ తెలిపింది. బంగారం తాకట్టుపై రుణాలు జారీ చేసే సమయంలో, వాటిని వేలం వేసే సమయంలో బంగారం స్వచ్ఛత, బరువుల్లో తీవ్రమైన వ్యత్యాసాలు గుర్తించినట్లు పేర్కొంది. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుందని పేర్కొంది.
ఆర్‌బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించిన అనంతరం ఆంక్షలను సమీక్షిస్తామని పేర్కొంది