TRINETHRAM NEWS

ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితలకు(Freebies) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌ని కోర్టు గురువారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించింది..

ఓటర్లను ప్రభావితం చేసేలా విచ్చలవిడిగా పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్నాయని ఆరోపిస్తూ అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ దాఖలు చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది.

అలాంటి పార్టీల గుర్తింపును, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిల్‌లో కోరారు. దేశంలో 3,061 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది హన్సారియా అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఓటర్ల ఆదరణ పొందేందుకు ప్రవేశపెట్టే ఈ పథకాలను పూర్తిగా నిషేధించాలని ఆయన విన్నవించారు. ఉచితాల వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని, దీర్ఘ కాలంలో నష్టపోతారని, ఎన్నికల స్వేచ్ఛ దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉచితాలను అందజేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ పార్టీల ధోరణి ప్రజాస్వామ్య విలువల మనుగడకే పెను ముప్పుగా పరిణమించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పిటిషనర్‌ వాదించారు. ఇది అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదని, ప్రజాస్వామ్య సూత్రాలు, పద్ధతులను పరిరక్షించడానికి దీనిని నివారించాలని కోరారు. పిటిషనర్ వాదనలపై సుప్రీంలో సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది..