TRINETHRAM NEWS

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలు విస్తృత చర్చలు జరిపినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్షం.. తదితర రంగాలతోపాటు సాంస్కృతిక, ప్రజాసంబంధాలను మరింత పెంపొందించడంపై నేతలు చర్చించారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్న ఖతార్‌ పాలకుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు’’ అని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
రెండు రోజుల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటన అనంతరం దోహాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఖతార్‌ విదేశాంగ సహాయ మంత్రి సుల్తాన్‌ బిన్‌ సాద్‌ అల్‌ మురైఖీ స్వాగతం పలికారు. తొలుత ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహ్మాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌థానీతో సమావేశమయ్యారు. ఇక్కడి ప్రవాస భారతీయులనూ పలకరించారు. ఈ దేశంలో ప్రధాని మోదీకిది రెండో పర్యటన. చివరిసారి 2016 జూన్‌లో ఇక్కడికి వచ్చారు….