Trinethram News : ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ అతి వాడకంతో పిల్లల చదువు పాడవుతోంది.. యువత చెడుదారి పడుతున్నారు అని చాలామంది అనుకుంటారు. అమెరికాకు చెందిన ‘సిగ్గీస్ డైరీ’ అనే కంపెనీదీ ఇదే అభిప్రాయం.
అక్కడి కుర్రకారుని కొద్దిరోజులైనా స్మార్ట్‌ఫోన్లకు దూరం చేయడానికి ఓ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే స్మార్ట్‌ఫోన్‌ని ముప్ఫై రోజులు వాడకుండా ఉన్నవారికి రూ.8లక్షలు ఇస్తానని ప్రకటించింది. దీనికోసం ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. డిజిటల్ డిటాక్స్ అవసరం తెలియజేస్తూ ఓ వ్యాసం రాయాలి. పోటీకి ఎంపికైన వారికి ఓ కీప్యాడ్ ఫోన్, సిమ్ వాళ్లే ఇస్తారు. స్మార్ట్‌ఫోన్‌ని పక్కనపెట్టి దాన్ని మాత్రమే ఉపయోగించాలి. విజయవంతంగా నెలపాటు అలా చేసినవారికి ఆ మొత్తం అందిస్తామంటోంది కంపెనీ. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. త్వరలోనే పోటీ మొదలవుతుంది. ఇది ఆన్‌లైన్‌లో బాగా వైరల్ కావడంతో.. మాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండు అంటున్నారు మనోళ్లు.