TRINETHRAM NEWS

కొడుకుని రంగంలోకి దించుదామనుకున్న మోపిదేవికి షాక్ ఇచ్చిన అధిష్టానం…

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడుగా ఉన్న మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణా రావు పార్టీ అధిష్టానంపై అలిగిన‌ట్టు తెలుస్తోంది.

తాజాగా పార్టీలో జ‌రిగిన ఇంచార్జుల మార్పు ద‌రిమిలా ఆయ‌న ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న కుమారుడిని పోటీ చేయించాల‌ని బావించారు.

గ‌త ఎన్నికల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోపిదేవి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చి.. త‌ర్వాత మంత్రిని చేశారు. అనంత‌రం.. రాజ్య‌స‌భ‌కు పంపించారు.

ఇలా.. జ‌గ‌న్ కు ఎంతో ద‌గ్గ‌ర అయిన నేప‌థ్యంలో త‌న మాట‌కు తిరుగులేద‌ని భావించిన మోపిదేవి.. రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న కుమారుడిని రంగంలోకి దింపేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు.

ఇప్ప‌టికే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో మోపిదేవి కుమారుడు మోపిదేవి రాజీవ్ జోరుగా పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌నకు ఇక్క‌డ సీటు క‌న్ఫ‌ర్మ్ అనుకునేంత స్థాయిలో రాజ‌కీయాలు జోరందుకున్నాయి.

కానీ, అనూహ్యంగా రేపల్లె ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ ప‌రిణామం మోపిదేవికి మంట పుట్టించింది ..

గణేష్ నియామకాన్ని వ్య‌తిరేకిస్తున్న ఎంపీ మోపిదేవి వర్గం రేపల్లెలో ఆందోళనకు దిగింది. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపింది. మోపిదేవికి మద్దతుగా పలువురు వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాకు సిద్ధమయ్యారు. రేపల్లెకు కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. అధిష్టానం మాత్రం.. ఎలాంటి డిమాండ్ల‌కు తలొగ్గే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. తాము చెప్పిన‌ట్టు వినాల్సిందేన‌ని.. తేల్చి చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.