TRINETHRAM NEWS

MLC polling today

Trinethram News : ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
ఉదయం 8 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం
1,23,985 మంది ఓటర్లు..
173 పోలింగ్‌ కేంద్రాలు..

సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత నడుమ పోలింగ్‌కు ఏర్పాట్లు
నేడు పోలింగ్‌ ముగిసే వరకు144 సెక్షన్‌ అమలు
ఖమ్మం, మే 26 : ఉమ్మడి ఖమ్మం – వరంగల్‌ – నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా సోమవారం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి సామగ్రిని తీసుకున్న ఎన్నికల సిబ్బంది.. ఆదివారం సాయంత్రానికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

ప్రశాంత ఎన్నికల కోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో పెరిగిన ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ కేంద్రాల్లో వసతులను మెరుగు పరిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో ముగ్గురు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఉన్నారు.

మిగతా 49 మంది అభ్యర్థులు వివిధ రిజిస్టర్‌ పార్టీల అభ్యర్థులతోపాటు ఏ పార్టీలతోనూ సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్‌ కేంద్రాలుండగా.. వాటిల్లో ఖమ్మంలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

వీటిలో విధులు నిర్వహించేందుకు ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీవోలు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈసీ మార్గదర్శకాలు ప్రకారం 20 శాతం అదనపు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల లోపల కూడా వంద శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి.

1,23,985 మంది ఓటర్లు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,23,985 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 50,676, మహిళలు 33,199 మంది, ట్రాన్స్‌జెండర్లు నలుగురు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 40,106 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 22,590 మంది, మహిళలు 17,516 మంది ఉన్నారు.

అయితే ఓటరు స్లిప్పులు అనేవి కేవలం ఓటర్లకు సమాచారం అందించేందుకు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వస్తున్న సమయంలో ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకపోవాల్సి ఉంటుంది.

సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసి వేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య నల్గొండలోని స్ట్రాంగ్‌ రూముకు తరలించనున్నారు. జూన్‌ 5న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC polling today