Trinethram News : 8th Jan 2024
వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
సమన్వయలోపంతో కొండా సురేఖ కాన్వాయ్ మిస్
చేర్యాల: కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జుస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయతోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మేడలాదేవీ, కేతలమ్మను మల్లన్న వివాహమాడారు. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాదీశ్వర వీరశైవ పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు, జిల్లా, మండల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు కల్యాణవేదికపైకి ఎగబడి తోసుకువచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.45కు కల్యాణం జరగాల్సి ఉండగా.. మంత్రులు ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమంలో సుమారు గంటన్నరపాటు ఆలస్యమేర్పడింది. మరోవైపు పోలీసులు, భద్రత అధికారుల మధ్య సమన్వయ లోపంతో మంత్రి కొండా సురేఖ కాన్వాయ్ మిస్సయింది. మల్లన్న కల్యాణం జరిగాక ఆమె గెస్ట్‌హౌ్‌సకు వెళ్లేందుకు బయటకు వచ్చారు. అక్కడ తన కాన్వాయ్ కనిపించకపోవడంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దాంతో ఆమె తన కూతురు సుస్మిత కారులో బయలుదేరారు. కాగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని, సుభిక్ష పాలనకు శక్తిని ప్రసాదించాలని మల్లన్నను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అమ్మవార్లకు కిరీటాలు సమర్పిస్తా: కొండా సురేఖ
వచ్చే కల్యాణానికి మేడలమ్మ, కేతలమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు. వచ్చే మేడారం జాతర విజయవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.