తుంగభద్ర బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
Trinethram News : కర్నూలు : తుంగభద్ర బోర్డు సమావేశం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుంగభద్ర డ్యామ్‌కు 33 గేట్లు ఒకేసారి మార్చాలని నిర్ణయించింది..
క్రస్ట్ గేట్లపై డీపీఆర్ సిద్ధం చేయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తుంగభద్ర అకౌంట్స్ ఫ్రీజ్ తొలగించాలని కోరింది. తుంగభద్రలో పూడిక కారణంగా కర్ణాటక ప్రతిపాదిస్తున్న నవళి జలాశయం నిర్మాణ ప్రతిపాదన సహాతుకమైనది కాదని తెలిపింది. కేసీ కెనాల్‌కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కృష్ణా నీటి మళ్లింపు ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా ఉందని చెప్పింది. కాగా కర్ణాటక, ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది.
గతంలో తుంగభద్ర బోర్డుకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం
కాగా.. గతంలో ఏపీ ప్రభుత్వానికి, తుంగభద్ర బోర్డుకు మధ్య వివాదం తలెత్తింది.జగన్ హయాంలో తుంగభద్ర కాలువల ఆర్సీసీ లైనింగ్ కోసం పిలిచిన టెండర్లలో నిబంధనలను పాటించలేదని, ఆనాటి వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడి చీకటి ఒప్పందాలు చేసుకున్నారనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేస్తూ సెప్టెంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. పైగా ఏపీ ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని తుంగభద్ర బోర్డు అధికారులు అంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చీకటి ఒప్పందం…
తుంగభద్ర కాలువలకు ఆర్సీసీ లైనింగ్ కోసం దాదాపు రూ.400 కోట్లతో గత ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన అప్పటి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు బళ్లారిలో మకాం వేసి కాంట్రాక్టర్లకు పనులు పంపకాలు చేశారు. తెర వెనుక చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యేలకు 5 శాతం వాటా ఇచ్చేలా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు వివిధ కారణాల వల్ల పనులు మొదలు పెట్టలేదు. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పూర్తి చేసి మొదలు పెట్టని పనులను, 25 శాతంలోపు పురోగతిలో ఉన్న పనులను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు బోర్డుకు వర్తించవని, ఆ టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు అనడం వివాదాస్పదంగా మారింది.
కర్ణాటక జలచౌర్యం..
తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లాలో సాగు, తాగునీరు అందించడానికి 24 టీఎంసీలు వాటా కలిగిన టీబీపీ ఎల్లెల్సీ కాలువ 0/0 కి.మీల నుంచి కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాల్ గ్రామం దగ్గర 250.850 కి.మీల వరకు, అనంతపురం జిల్లాలో సాగు, తాగునీరు అందించేందుకు 31.50 టీఎంసీలు నికర జలాలు వాటా ఉన్న టీబీపీ హెచ్చెల్సీ కాలువ 0/0 నుంచి అనంతపురం జిల్లా బొమ్మనహాల్ సమీపంలో 105 కిలో మీటర్ల వరకు తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు పర్యవేక్షణలో ఉంది. 1955లో తుంగభద్ర కాలువలు నిర్మించడం వల్ల కాల్వ గట్టు పలు ప్రాంతాల్లో బలహీనంగా మారింది. పూడిక నిండిపోయింది. దీనికి తోడు ఎగువన కర్ణాటక జలచౌర్యం వల్ల వాటా జలాలు అందడం లేదు. తంగభద్ర డ్యాంలో చేరే వరదను టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా ఎల్లెల్సీ కాల్వకు సగటున 16-18 టీఎంసీలు కేటాయిస్తారు. పూర్తి వాటా నీటిని తీసుకోవాలంటే ఎల్లెల్సీ ఆధునికీకరణలో భాగంగా కర్నూలు జిల్లా పరిధిలో 115.275 కి.మీల నుంచి 205.45 కి.మీల వరకు రూ.448 కోట్లతో చేపట్టే 9 ప్యాకేజీలకు 2022 ఫిబ్రవరి 26న టీబీపీ బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీరు (ఎస్ఈ) అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చారు. అదే ఏడాది మార్చి 4న టెండరు పక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దాదాపుగా ఈ పనులు పూర్తయ్యాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారుగా రూ.319 కోట్లు వరకు బిల్లులు బకాయి ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
కర్నూలు జిల్లా పరిధిలో తుంగభద్ర దిగువ (ఎల్లెల్సీ) 205.45 కి.మీల నుంచి 250 కి.మీల వరకు రూ.300 కోట్లు, అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ రూ.100 కోట్లు కలిపి రూ.400 కోట్లతో ఆర్సీసీ లైనింగ్ పనులకు 13 ప్యాకేజీలకు 2023 జనవరి 1న ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచారు. నిబంధనలు పాటించలేదని యారో కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు, కొందరు టీబీపీ బోర్డు అధికారులు ఆ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చి స్టే ఎత్తివేయించారని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు రంగ ప్రవేశం చేసి బళ్లారిలో మకాం వేసి పనులను కాంట్రాక్టర్లకు పంపకాలు చేశారు. ఇందుకు ఆ ఎమ్మెల్యేలకు 5 శాతం వాటా అంటే దాదాపు రూ.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ఆ కాంట్రాక్టరు ఒక్కటే షెడ్యూలు దాఖలు చేసేలా రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి 5 శాతం అధిక ధరలకు పనులు దక్కించుకున్నారని తెలుస్తోంది. టీబీపీ బోర్డు ఇంజనీర్లు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు రావడంతో కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టలేదు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ కూటమి సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి.. మొదలు పెట్టని పనులు సహా 25 శాతంలోపే పురోగతి ఉన్న పనులు రద్దు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం గత నెల సెప్టెంబరు 27న ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులు వర్తించవు…
తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు సమావేశంలో తీసుకునే నిర్ణయాలే కీలకమని, ఏపీ ప్రభుత్వం ఆదేశాలు వర్తించవని బోర్డు అధికారులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికీ మొదలు పెట్టని ఆ పనులు రద్దు చేయబోమని వారు తేల్చిచెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు-94 ప్రకారం టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకుని, ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టర్లో టెండర్లు పిలిచినప్పుడు.. ఇంకా మొదలు కాని పనులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు వర్తించవని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు టెండర్లు వేసిన ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిన కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే బోర్డు అధికారులు ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని, ఏపీ ప్రభుత్వం రూల్స్ పాటించాలని బోర్డు నిబంధనల్లో స్పష్టంగా ఉందని ఓ కాంట్రాక్టరు పేర్కొన్నారు. ఆర్సీసీ లైనింగ్ పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని ఓ కాంట్రాక్టరు తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. పనులు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిస్తే పోటీ పెరిగి 5 శాతం తక్కువ (లెస్)కు టెండర్లు వేసే అవకాశం ఉందని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.40 కోట్లు వరకు ఆదా అవుతుందని, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టరు పేర్కొన్నారు. దీనిపై టీబీపీ బోర్డు ఇన్చార్జి ఎస్ఈ నీలకంఠరెడ్డిని ఆంధ్రజ్యోతి ఫోన్లో వివరణ కోరగా అదనపు నిధులతో ఎల్లెల్సీ లైనింగ్ పనులు చేపట్టారన్నారు. ఏపీ ప్రభుత్వం 55 శాతం, కర్ణాటక ప్రభుత్వం 45 శాతం నిధులు చెల్లిస్తుందన్నారు. టెండర్లను బోర్డు ఆమోదించడంతో రద్దు చేయాల్సిన అవసరం లేదని, దీనికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు వర్తించవని పేర్కొనడం కొసమెరుపు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App