TRINETHRAM NEWS

2025లో కేసీఆర్‌ మళ్ళీ రాజకీయాలలోకి: కేటీఆర్

Trinethram News : లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. శాసనసభ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో రాజకీయాలలో కేసీఆర్‌ టైమ్ ముగిసిపోయిందని, ఇక కేటీఆర్‌తోనే లెక్కలు తేల్చుకుంటానని ఇటీవలే సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

కానీ కేసీఆర్‌ 2025లో మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారని ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. ‘ఆస్క్ కేటీఆర్‌’ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ గురించి పలువురు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఏమని సమాధానం చెప్పారంటే, “కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. రాజకీయాలలో నేటికీ ఆయనే మా అందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన సూచనలు, సలహాల ప్రకారమే మేమందరం నడుచుకుంటున్నాము. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన మౌనంగా ఉన్నారు తప్పితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటానికి మరే కారణం లేదు. కొత్త సంవత్సరం నుంచి ఆయన మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారు,” అని చెప్పారు.

ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ, పదేళ్ళ పాలన చేసినప్పుడు సహజంగానే ప్రభుత్వం పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ కారణంగానే మేము ఓడిపోయాము. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించగలిగింది. అందుకే అది ఎన్నికలలో విజయం సాధించగలిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మేము కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విడిచిపెట్టము,” అని కేటీఆర్‌ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App