TRINETHRAM NEWS

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి సంబంధించి ఏడోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. లిక్కర్‌ కేసు వ్యవహారం కోర్టులో ఉన్న తరుణంలో విచారణకు నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని ఆప్‌ ఆరోపిస్తుంది.

ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఇంతకుముందు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంతో మనీలాండరింగ్‌ కేసులో విచారణకు కేజ్రీవాల్‌ హాజరుకాకపోవడంపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈడీ ఫిర్యాదుపై ఇటీవల కోర్టు సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థాన విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు. అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తాజాగా కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేయడం ఉత్కంఠ రేపుతుంది.

మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎంను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా 26న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠగా మారింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గతంలో హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది