TRINETHRAM NEWS

జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలు, హాజరుకానున్న 45,702 మంది విద్యార్థులు

జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు

విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

శ్రీకాకుళం,ఫిబ్రవరి,3: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, ప్రాక్టికల్స్ జరుగనున్న నేపథ్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వొకేషనల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుండి జరుగుతాయని ఇంటర్మీడియట్ జనరల్ ప్రాక్టికల్స్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

జిల్లాలో 45,702 మంది విద్యార్థులు కానున్నారని, ఇందులో ఇంటర్మీడియట్ జనరల్ 43071, ఒకేషనల్ 2631 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. మొదటి సంవత్సరం 19937 మంది, రెండవ సంవత్సరం 25765 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. ఇన్విజిలేటర్లు 1600 మంది, సిసి కెమెరాలు 1480 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 85 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుండి మార్చి 20వ తేదీ వరకు ఉంటాయని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడ బస్సులు నడపాలని, విద్యుత్ అంతరాయం లేకుండా, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్, ప్రధమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు అధికారులు తమ తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. మెడికల్ సిబ్బంది పరీక్ష కేంద్రాలకు 8 గంటలకే హాజరుకావాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు సెల్ ఫోన్లు వాడరాదన్నారు.

ఎఎస్పీ విఠలేశ్వరరావు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద అదనంగా పోలీసు బందోబస్తు అవసరమైతే తెలియజేయాలన్నారు. ఎస్కార్ట్ అవసరమైనా తెలపాలని చెప్పారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని వివరించారు.

డిఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా శాఖ నుండి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఆర్ఐఓ దుర్గారావు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, పరీక్షల ఏర్పాట్లు, తదితర వాటి గూర్చి వివరించారు. ఆర్టీసి పిఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం బస్సు లు బాగానే ఉన్నాయని, అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి కె. ప్రకాశరావు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, ఆర్టీసి నుండి పిఆర్ఓ శ్రీనివాసరావు, వైద్య శాఖ నుంచి డాక్టర్ ప్రవీణ్, విద్యుత్, ఆయా శాఖల అధికారులు, సంబంధిత పరీక్షల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.