TRINETHRAM NEWS

వచ్చే బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ. 2000 కోట్లు కేటాయించాలి
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా, మార్కాపురం.నిరంతరం కరువు కాటకాలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశానికి జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో రూ 2,000 కోట్ల లను కేటాయించాలని, అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని అఖిల పక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం వచ్చే శాసనసభ బడ్జెట్లో రూ 2,000 కోట్లు కేటాయించాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎంపీజే , ఏఐటీయూసీ, సీఐటీయూ, తదితర పార్టీలు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పూల సుబ్బయ్య శాంతిభవన్లో కమిటీ కో ఆర్డినేటర్ డి కే ఎం రఫీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య మాట్లాడుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం గత ఏడు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి నిరాధరణకు గురవుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాధారం తప్ప మరో నీటి ప్రత్యామ్యం లేని పశ్చిమ ప్రకాశానికి కృష్ణా జలాలే శరణ్యమని సిపిఐ పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగానే నాడు పాలకవర్గం వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగి 28 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే వెలిగొండ ప్రాజెక్టును ఉపయోగించుకోవడం మినహా చిత్తశుద్ధి లేదని ఆయన టిడిపి,వైసిపి పార్టీల వైఖరిని తీవ్రంగా మర్శించారు.

ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఆయా పార్టీలకు ఏమాత్రం లేదని, ఉంటే ఈపాటికి ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండేదని అన్నారు.

పశ్చిమ ప్రకాశంలో వర్ష పరిస్థితుల కారణంగా వేసిన పంటలు పండక, పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి వస్తుందని నియోజక వర్గ సిపిఐ కార్యదర్శి అన్నారు.

సిపిఎం కార్యదర్శి డి. సోమయ్య మాట్లాడుతూ నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు నేటికీ ఆర్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. సొరంగ మార్గం వున్న కొత్తురు గ్రామం నుండి కలనూతల గ్రామం వరకు వున్న ఫిడర్ కెనాల్ లో పిచ్చి చెట్లు పెరిగాయని, కావున వీటినే వెంటనే తొలగించడంతో పాటు కెనాల్ మరమ్మత్తులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మొదటి సొరంగం నిర్మాణ పనులు పూర్తయ్యాయని దీంతో పాటుగా రెండో సొరంగం నిర్మాణంలో వేసిన ఐదు రంద్రాలను పూడ్చివేసి మొదటి సొరంగం ద్వారా నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముంపు గ్రామాలలో 2019 అక్టోబర్ కు 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే అర్ అర్ ప్యాకేజీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే నేటికీ ప్యాకేజీ అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కావున
అర్హుల జాబితా 2019 అక్టోబర్ కు కాకుండా 2025 జనవరి నాటికి 18 సంవత్సరాలు వయసు దాటిన వారిని గుర్తించి వారందరికీ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని సిపిఎం కార్యదర్శి డి.
సోమయ్య డిమాండ్ చేశారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సయ్యద్ జావిద్ అన్వర్ మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం వామపక్ష పార్టీలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును అందజేయడమే కాకుండా, ఉద్యమాలలో పాల్గొంటామని ఆయన అన్నారు. ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు కొనసాగించాలని ఆయన అన్నారు. పాలకుల చిత్తశుద్ధి లోపం వల్లనే వెలిగొండ ప్రాజెక్టు మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో నలిగిపోతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్కె కాసిం, సిపిఐ కార్యదర్శి చిత్తారీ పెద్దన్న,ఏపి రైతు సంఘం నాయకులు కొండయ్య, కోటేశ్వర రావు, కాశయ్య, సిపిఎం నాయకుడు.తిరుపతి రెడ్డి,జి.రాజశేఖర్ రెడ్డి,నాగరాజు,నన్నేసా తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App