TRINETHRAM NEWS

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత కల్పిస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని తెలిపారు. ‘‘దేశంలోని రైతులకు లబ్ధి చేకూరేలా.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీంతో రైతుల జీవితాల్లో మూడు కీలక మార్పులు జరుగుతాయి. పంటకు కచ్చితమైన ధర లభించడంతోపాటు అప్పుల బాధ తొలగిపోతుంది. రైతుల ఆత్మహత్యలు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా మారి.. రైతులు సంపన్నులు అవుతారు. ఈ నిర్ణయం దేశంలోని 15 కోట్ల రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. ఇది కాంగ్రెస్‌ తొలి హామీ. #KisaanNYAYGuarantee’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. 
మరోవైపు రైతులను అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. రైతుల అభ్యున్నతి కోసం పాటుపడిన చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించిందని, అదే రైతులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఆరోపించారు. ఈ క్రమంలో రైతుల నిరసనలపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమని, దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు. కానీ, రైతు సంఘాల నాయకులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.