ఉచ్చులో పడిన చిరుతను చంపి వండుకు తిన్న వేటగాళ్లు!
ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఘటన
ఉచ్చులో పడిన చిరుతను ఏం చేయాలో తెలియక చంపి, వండుకుతిన్న వైనం
నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
చిరుతను చంపి తినడం ఇదే తొలిసారని సుశాంత నందా దిగ్భ్రాంతి
ఇలాంటి వారిని సంఘం నుంచి బహిష్కరించాలన్న అటవీ అధికారి
Trinethram News : Odisha : అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో పడిన చిరుతను చంపేసిన వేటగాళ్లు ఆపై దానిని వండుకుతిన్నారు. ఒడిశాలోని నౌపడ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. జిల్లాలోని దియోధరా గ్రామ సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు ఈ నెల 15న అడవి పందుల కోసం ఉచ్చు పన్నారు. అందులో పందికి బదులు చిరుత చిక్కుకుంది.
చిక్కిన చిరుతను ఏం చేయాలో తెలియక వేటగాళ్లు దానిని చంపి వండుకుని తినేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ అధికారులు నిందితుల ఇళ్లపై దాడి చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మిగిలిన చిరుత మాంసాన్ని, ఇతర భాగాలను స్వాధీనం చేసుకున్నట్టు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ముస్తాఫా సలేహా తెలిపారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
చిరుతను వండుకుని తిన్న ఘటనపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత నంద దిగ్భ్రాంతికి గురయ్యారు. క్రూర జంతువుల జాబితాలో ఉన్న చిరుతను చంపి తినడం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇది అత్యంత అనాగరిక చర్య అని వాపోయారు. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App