TRINETHRAM NEWS

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరియాణా, దిల్లీ(Delhi)లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.

ఈ నెల 13న దాదాపు 200 రైతు సంఘాలు ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని హరియాణా పోలీసులు సూచించారు. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144ను విధించారు. పోలీసు శాఖ సూచనలు అనుసరించి.. ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని కోరారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు.

ఇక దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్‌, హరియాణా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు. ఒక వేళ రైతులు నగరంలోకి రావాలని యత్నిస్తే.. వీటిని వాడి సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు.

కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. దీనిపై రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దాలెవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే.. హరియాణాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ”సరిహద్దులు మూసేశారు. 144వ సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా..? ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాలి” అని అన్నారు.