ఆత్మలతో మాట్లాడి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు!
గత ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ… పని తక్కువ
ఫీజు రీఎంబర్స్ మెంట్ తో సహా 6,500 కోట్ల బకాయిలు పెట్టారు
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సర్కారు స్కూళ్ళలో 4లక్షల విద్యార్థుల తగ్గుదల
కెజి టు పిజి విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేస్తాం
5ఏళ్లలో ఏపీ విద్యావ్యవస్థను నెం.1 గా తీర్చిదిద్దుతాం
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి లోకేష్
అమరావతి: అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది, రాత్రి ఆత్మలతో మాట్లాడటం, ఉదయాన్నే అడ్డగోలు నిర్ణయాలు అమలు చేశారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం విజయవాడ ఎ1 ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… జిఓ.117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేసారు, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు. వెయ్యి స్కూల్స్ లో సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మేము వచ్చిన తరువాత టెస్ట్ పెడితే 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ భవిష్యత్తు తో గత ప్రభుత్వం ఆటలాడింది. టోఫెల్, ఐబీ కూడా అలాంటి నిర్ణయాలే కనీస అవగాహన లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిర్ణయాలు అమలు చేసారు.
విద్యావ్యవస్థలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేం
విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేం. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి అది మనం అమలు చేయగలమా లేదా ? విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ. ఫీజు రీఎంబర్స్ మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి రూ. 6,500 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం.
విద్యార్థుల తలరాతను మార్చేది గురువు!
తలరాతను రాసేది బ్రహ్మ అయితే, విద్యార్థుల తల రాతను మార్చేది గురువు. విద్యార్థుల భవిష్యత్తును బంగారంగా మార్చే ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. వరదలు కారణంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోలేకపోయాం. ఉపాధ్యాయ వృత్తి అంటే మనకి మొదట గుర్తొచ్చేది డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీ నుండి కలకత్తా యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి పూల వర్షం కురిపించారు. ఉపాధ్యాయులకు మాత్రమే దక్కే అరుదైన గౌరవం అది. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టే చెత్త ప్రభుత్వం పోయింది. ఉపాధ్యాయులను గౌరవించే ప్రజాప్రభుత్వం వచ్చింది.
విద్యాశాఖ తీసుకోవద్దని సలహా ఇచ్చారు
నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని ఛాలెంజ్ గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. డిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు ఐదేళ్ల లో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం లాంటివి విద్యలో భాగం కావాలి. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి. ఉత్తమ పౌరులను తయారుచేసే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం.నా బలం, బలగం అయిన ఉపాధ్యాయుల వలనే ఇది సాధ్యం అవుతుంది. అవుట్ కం బేస్డ్ విద్య కోసం ఉపాద్యాయులు కృషి చేయాలి. రాష్ర్టంలో విద్యావ్యవస్థను రాబోయే రోజుల్లో నెం.1 చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. రాబోయే.రోజుల్లో ఉన్నతవిద్యలో ఎన్ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రానికి 3 వ స్థానం సాధిస్తాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీల్లో ఏపీ వర్శిటీ ఉండేలా కృషిచేస్తాం.
విద్యావ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి
విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. గత ప్రభుత్వం లో పేర్లు, రంగులు, ఫోటోల పిచ్చి మీరు అందరూ చూసారు. నేను మంత్రి అయిన తరువాత ఎక్కడా నా ఫోటో పెట్టొద్దని చెప్పాను. పార్టీ రంగులు, నాయకుల పేర్లు వద్దని ఆదేశాలు జారీ చేసాను. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి గొప్ప వ్యక్తుల పేర్లతో పధకాలు అమలు చేస్తున్నాం. ఒక పాఠం చెప్పాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, అందరికీ అర్ధం అయ్యేలా చెప్పడం ఇంకా కష్టం. ఉపాధ్యాయులు ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఉపాధ్యాయులకు చదువు చెప్పే బాధ్యత తప్ప ఇతర పనులు పెట్టకూడదు అని నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వం అనేక యాప్ లు తీసుకొచ్చి చదువు చెప్పాల్సిన మీతో బాత్ రూమ్ ఫోటోలు తీయించింది. నేను పనికిమాలిన యాప్స్ అన్ని తీసేయ్ మని ఆదేశించాను. మీ మీద భారం తగ్గించేందుకు అధికారులతో చర్చిస్తున్నాను. త్వరలోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాం. ఏడాదికి 4 సార్లు మెగా పిటిఎం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల నుండి అందరూ భాగస్వామ్యం కావాలి. విద్యార్థుల సామర్ధ్యాన్ని తల్లితండ్రులకు తెలిసేలా చెయ్యడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
త్వరలో మెగా డిఎస్సీ నిర్వహణ
త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం. క్లాస్ కో టీచర్ ఖచ్చితంగా ఉండాలి అనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్ఠిక ఆహారం అందిస్తున్నాం. జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు పెట్టబోతున్నాం. నాడు- నేడు అని పబ్లిసిటీ చేసారు అసలు కొన్ని స్కూల్స్ లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్ లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్ లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేసాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. నేను మీనుండి కోరుకునేది ఒక్కటే మీ సక్సెస్ స్టోరీస్ ఇతర ఉపాధ్యాయులకు షేర్ చేయండి. వచ్చే ఏడాదికి అవార్డులు అందుకునే వారి సంఖ్య డబుల్ అవ్వాలి. మీరు తలుచుకుంటే మనం ప్రైవేట్ స్కూల్స్ కి గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకం నాకుంది. అందరం కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కు పూర్వ వైభవం తీసుకొద్దాం. విద్యార్థులను జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ పోటీ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే సూపర్ కిడ్స్ ను తయారు చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App