
చెన్నై: సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని వేలి ముద్ర, ఐరిస్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే వాటిని అన్‌లాక్ చేసే దిశగా మద్రాస్ ఐఐటీలో పరిశోధక విద్యార్థి ముకేశ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేశాక, సెల్‌ఫోన్ అన్‌లాక్‌తోపాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ఈ సాంకేతికత.. వైద్యరంగంలోనూ ఉపయోగపడుతందన్నారు. ‘‘ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా మేం చూపించాం. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి మా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ సాంకేతికతను వాడటానికి మానవుడు జీవించి ఉండటం అవసరం. కాబట్టి ఇది మనుగడకు రుజువుగానూ ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇన్‌హేలేషన్ థెరపీకీ ఇది సాయపడుతుంది. ఈ రుగ్మతలున్న వ్యక్తికి ఎంత మోతాదులో ఔషధాన్ని ఇవ్వాలో ముందే నిర్ణయించడానికీ ఉపయోగపడుతుంది’’ అని ఐఐటీ కార్పొరేట్ కమ్యూనికేషన్, అప్లైడ్ మెకానిక్స్ విభాగాధిపతి మహేశ్ తెలిపారు.
