TRINETHRAM NEWS

లోక్‌సభ ఎన్నికల ముందు కర్నాటకలో సరికొత్త రాజకీయం.. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత

CM Siddaramaiah: కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్లు దాటింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టి కూడా ఆర్నెళ్లు దాటిపోయింది. అయితే, ఈ ఆర్నెళ్లూ పెద్దగా సంచలన నిర్ణయాలు తీసుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయాలను కుదిపేసే నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల ముందు హిజాబ్‌పై నిషేధం ఎత్తివేస్తూ సంచలన ప్రకటన చేశారు సీఎం సిద్ధూ.

హిజాబ్‌ వివాదంపై కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మైసూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్య.. హిజాబ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నామని, మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో హిజాబ్‌పై వివాదం చెలరేగడంతో నిషేధం విధించింది అప్పటి ప్రభుత్వం. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పలువురు పిటిషన్లు వేసినా… హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని తీర్పునిచ్చింది కర్నాటక హైకోర్టు. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దాంతో, హిజాబ్‌పై నిషేధం ఎత్తివేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్ల తర్వాత, అది కూడా లోక్‌సభ ఎన్నికల ముందు ఆ హామీని అమలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

హిజాబ్‌పై నిషేధం ఎత్తివేయడంతో బీజేపీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. లోక్‌సభ ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం కర్నాటకలో రాజకీయ కల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ నిర్ణయం కాంగ్రెస్‌కి ప్లస్‌ అవుతుందా?. లేదంటే ఈ ఇష్యూని తనకి అనుకూలంగా బీజేపీ మార్చుకుంటుందా? చూడాలి.