Free sand policy for local needs
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం..
మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..
అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం..
అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది లేదు..
సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్.ఆర్ గార్డెన్ లో బుధవారం రోజున మానేరు పరివాహక ప్రాంత ఇసుక ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో ఆత్మీయ, అవగాహన సమావేశం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం, స్థానిక అవసరాల కోసం, పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు..
గత ప్రభుత్వం ఇసుక రీచ్ లను ఏర్పాటుచేసి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ వంటి నగరాలకు విచ్చలవిడిగా పంపించి సొమ్ము చేసుకుందని విమర్శించారు. అలాగే స్యాండ్ టాక్స్ విధానం ద్వారా స్థానిక అవసరాలకు కూడా ప్రజలపై భారం మోపిందన్నారు. సాండ్ టాక్స్ విధానంలో ఎస్.ఆర్.ఓ లు ఇష్టానుసారంగా ఇసుక రవాణాకు అక్రమ అనుమతులు ఇచ్చి పెద్ద దందా నడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సమస్యలు అన్ని అధిగమించి ప్రజలకు ఫ్రీ ఇసుకను ఇస్తామని, లారీల ద్వారా ఇసుక రవాణాను జరపబోమని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లవారి నుంచే ఇసుక లారీలను కట్టడి చేయడం, ఫ్రీ ఇసుకను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే కొంతమంది అతి ఆపేక్ష వల్ల లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని చెప్పారు. ఈ వ్యవహారం వల్ల ఫ్రీ ఇసుక విధానానికి ఆటంకాలు ఏర్పడి, తిరిగి శ్యాండ్ టాక్స్ విధానాన్ని అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయించారని తెలిపారు. అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేయడం, లారీల ద్వారా ఇసుకను పంపడం, రాత్రుల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగించడం వంటి చర్యల వల్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తిరిగి తాను జిల్లా కలెక్టర్ మాట్లాడి మరొక అవకాశం ఇవ్వాలని కోరగా అంగీకరించారని, అయితే, ట్రాక్టర్ యజమానుల తరపున అక్రమ రవాణా చేయమని బాధ్యత వహించి లెటర్ ఇవ్వాలని కలెక్టర్ కోరినట్టు చెప్పారు. దీనికి అంగీకరించి తాను కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన లెటర్ ను ట్రాక్టర్ యజమానుల సమక్షంలో ఆర్డీవో అందజేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారని చెప్పారు. నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించినా ఇక తాను బాధ్యత వహించబోనని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఉన్న పాలకులు, స్థానిక అధికార యంత్రాంగం ఇసుక రవాణా చేస్తూ పబ్బం గడుపుకున్నారని, తాను మాత్రం అవినీతికి పాల్పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఎమ్మెల్యే విజయరమణ రావు భావోద్వేగం తో పేర్కొన్నారు. అవినీతికి తల ఒగ్గేది లేదని స్పష్టం చేశారు. మానేరు వాగును కాపాడుకుంటేనే భావితరాలకు ప్రకృతి సంపద లభిస్తుందని, లేకుంటే మానేరు గుల్ల అయి అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే చేతులు జోడించి అభ్యర్థించారు.
అంతకుముందు పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడి ఫ్రీ ఇసుక విధానం తీసుకువచ్చి ఎమ్మెల్యే విజయరమణ రావు అందరికీ న్యాయం చేశారని అన్నారు. ఇక ముందు నుండి అక్రమాలకు పాల్పడే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్న తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సీఐ, తహసిల్దార్, ఎస్సై మరియు ట్రాక్టర్ యాజమానులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App