TRINETHRAM NEWS

Adimulapu Suresh : కార్మికుల స‌మ‌స్య‌లపై ఫోక‌స్ – సురేష్
ఏపీ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు దృష్టి సారిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ . సాధ్య‌మైనంత మేర‌కు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

మున్సిప‌ల్ కార్మిక సంఘాల నేత‌ల‌తో మంత్రి స‌మావేశం అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వీరి మ‌ధ్య ఏడు గంట‌ల పాటు కొన‌సాగింది. ఇందులో ప్ర‌ధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వారికి భ‌రోసా ఇవ్వాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు.

అన్నింటిని ప‌రిష్క‌రించ లేమ‌ని, కొన్నింటిని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు సురేష్. స‌మ్మెను విర‌మించాల‌ని కోరారు. రాష్ట్రంలోని 41 పుర‌పాల‌క సంఘాల్లో 41 చోట్ల 100 శాతం కార్మికులు ప‌నిలో ఉన్నార‌ని అన్నారు.

మొత్తం 48 వేల 753 మంది కార్మికుల‌కు గాను కేవ‌లం 19,162 మంది మాత్ర‌మే స‌మ్మెలో ఉన్నార‌ని చెప్పారు మంత్రి ఆదిమూల‌పు సురేష్‌. ఇదిలా ఉండ‌గా గుంటూరు, విజ‌య‌వాడ‌, మార్కాపురం క‌మిష‌న‌ర్ల‌తో నేరుగా మాట్లాడారు.

కార్మికుల‌కు సంబంధించి కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టేందుకు ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి చోటా పీఎఫ్‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించామ‌ని తెలిపారు మంత్రి.