తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన మొదలైంది.. రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 43 నుంచి 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
రాత్రుళ్లు సైతం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రాబోయే నాలుగు రోజులు తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.
మరో నాలుగు రోజులు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపింది.
ఏపీలో కూడా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఐఎండి సూచనల ప్రకారం.. శనివారం 179మండలాల్లో తీవ్రవడగాల్పులు, 209మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు 44మండలాల్లో తీవ్ర,193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరోవైపు మే, జూన్‌లోనూ అధిక ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్‌ఎస్, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.