TRINETHRAM NEWS

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు(Justice NV Ramana) విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు మాజీ సీజేఐకి వినతిపత్రాలు అందజేశారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమరావతిలోని మహిళా రైతులు తమకు ఎదురైన కష్టాలను వివరించారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల తాము 1,563 రోజులుగా నిరసనలు చేస్తున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేశారని, తాను కూడా రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చానని చెప్పారు.

రైతుకు, అతని భూమికి మధ్య ఉన్న సంబంధం తల్లి, బిడ్డల వంటిదని, రైతు భూమిని కోల్పోవడం సాధారణ సమస్య కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఐదేళ్లుగా భూములిచ్చి నేరగాళ్లలా రైతులు కోర్టుల్లో నిలబడడం ఏంటి అనిఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. న్యాయ వ్యవస్థ వారికి కూడా పని చేస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ తమ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.