TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం : తిరుమల తిరుపతి దేవస్థానం గో మరణాలపై అసత్య ప్రచారం తగదని, భూమన కరుణాకరరెడ్డి మత విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘అదో నల్లరాయి.. దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ’ గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్‌ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.

అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్‌ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో, వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని, ఇవి గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందన్నారు. కరుణాకర రెడ్డి ప్రెస్‌ మీట్‌ లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదని, ఎక్కడివో.. వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గోసంరక్షణ శాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు గోవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతుందన్నారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్‌ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియోట్యాగ్‌ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోశాలను గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతిరోజూ శుభ్రపరచడం, బ్లీచింగ్‌ చేయడం జరుగుతోందన్నారు. గోశాలను సందర్శించిన భక్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇక్కడ పరిశుభ్రత లేదంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సహజ మరణం పొందిన ఆవులకు పోస్టుమార్టం చేయడం ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ఏదైనా ప్రమాదంతోగానీ, అనుమానాస్పదంతో జరిగితే తప్పనిసరిగా పోస్టుమార్టం చేయడం జరుగుతుందన్నారు.

జనన, మరణాల రిజిష్టరును గోసంరక్షణ శాలలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసికూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టరులో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. లేగదూడలను పసిబిడ్డలుగా భావిస్తూ గోశాల సిబ్బంది సేవలందిస్తున్నారని అన్నారు. కానీ నేను నాస్టికుడినని స్వయంగా కరుణాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామిదేముంది.. ఒక నల్ల రాయి.. దానిని పెకిలించేస్తానంటూ గతంలో ప్రకటించలేదా? అని నిలదీశారు.

కరుణాకర్‌ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌ గా పనిచేసిన సమయంలో ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, టిక్కెట్లు అమ్ముకోవడం, డాలర్లు మాయం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడలేదా? అంటూ మండిపడ్డారు. తిరుపతి కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది, ఏడుకొండలను 5 కొడలుగా మార్చి కుట్ర చేసింది, టీటీడీని కూడా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గా మార్చే చర్యలకు పాల్పడిరది కరుణాకర్‌ రెడ్డి కాదా అంటూ మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కరుణాకర్‌ రెడ్డిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

False propaganda on TTD