High Court : ఆరోపణలు, అనుమానాల ఆధారంగా పరీక్షల రద్దు తగదు
పారదర్శకత కోసమే బహుళ మూల్యాంకనం
రెండు హాల్‌టికెట్ల జారీతో నష్టం లేదు
మాస్ కాపీయింగ్, ప్రశ్న పత్రాల లీకేజీ వంటివి జరిగిన దాఖలాల్లేవు
తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేందుకూ ఆధారాల్లేవు
గ్రూప్-1పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు
తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం
Trinethram News : పబ్లిక్ సర్వీసు కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను ఊహాగానాలు, నిరాధారమైన ఆరోపణల ఆధారంగా అనుమానించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మాస్ కాపీయింగ్, ప్రశ్న పత్రాల లీకేజీ జరిగినట్లుగానీ, ఒకరు, లేదంటే కొందరు అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షల్లో సహకరించారనిగానీ స్పష్టమైన ఆధారాల్లేకుండా ఏకపక్షంగా పరీక్ష రద్దు చేయడం సరికాదని తేల్చిచెప్పింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని
పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లను విచారించిన సింగిల్ జడ్జి.. గత ఏడాది మార్చి 10న విడుదల చేసిన తుది మార్కుల జాబితా, మార్చి 30న విడుదలైన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయాలని, సంజయ్‌సింగ్ కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం.. మోడరేషన్ పద్ధతిలో రీవాల్యుయేషన్ ప్రక్రియను మాన్యువల్‌గా నిర్వహించి ఫలితాలను వెల్లడించడం ద్వారా 563 పోస్టులను భర్తీ చేయాలని, లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు అర్హత సాధించిన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం 123 పేజీల తుది తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. తీర్పులోని ప్రధాన అంశాలిలా..
అనుమానాలేగానీ ఆధారాల్లేవు
‘‘గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేయడం అనుమానాస్పదంగా ఉందని సింగిల్ జడ్జి పేర్కొన్నారు. అయితే పరీక్షల నోటిఫికేషన్‌లో రెండు హాల్‌టికెట్ల జారీపై ఎలాంటి నిషేధం లేదు. రెండు హాల్‌టికెట్ల జారీ అనేది పిటిషనర్లను ఏవిధంగా నష్టపరిచిందో చూడాలి. ఆ కారణంగా తుది ఫలితాల్లో ఒకరు లేదా కొందరికి ప్రయోజనం చేకూరినట్లు నిరూపణ అయిందా అన్నదీ విశ్లేషించాలి. ఈ పిటిషన్‌కు సంబంధించి సింగిల్ జడ్జి అలాంటి నిర్ధారణేదీ చేయలేదు. మెయిన్ పరీక్షలకు కొత్తగా హాల్‌టికెట్ జారీచేయడం వల్ల పరీక్షల పవిత్రత దెబ్బతిన్నదని పిటిషనర్లు వాదిస్తున్నప్పటికీ అదెలాగో నిరూపించడంలో విఫలమయ్యారు.
పరీక్ష కేంద్రాల ఆరోపణలకు ఆధారాల్లేవు
పరీక్ష కేంద్రాల పెంపుతోపాటు కేటాయింపులకు సంబంధించి కమిషన్ దురుద్దేశపూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలను పిటిషనర్లు నిరూపించలేకపోయారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగిందని, పురుషులకు మరుగుదొడ్లు లేకపోవడం వల్లనే కొన్ని కేంద్రాలను మహిళలకు కేటాయించామని కమిషన్ వెల్లడించింది. 2 సెంటర్లను మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించడంతో పక్షపాతం జరిగిందనుకోలేం.
ఏకరీతి మూల్యాంకనం
కమిషన్ మూల్యాంకనంలో ఏకరీతిని అనుసరించిందని, ఆ మూల్యాంకన విధానంలో అభ్యర్థిని గుర్తించడానికి అవకాశం ఉందని పిటిషనర్లు ఆరోపణలు చేస్తున్నారు. బహుళ మూల్యాంకన విధానంలో బార్‌కోడ్ ఉండదని, అభ్యర్థిని గుర్తించలేమని కమిషన్ వివరించింది. పైపెచ్చు కమిషన్ ఏ ఒక్క అభ్యర్థికీ అనుకూలంగా వ్యవహరించినట్లు పిటిషనర్లు నిర్దిష్టమైన ఉదాహరణలు చూపలేకపోయారు. నిష్పక్షపాతంగా పరీక్ష నిర్వహించడంలో కమిషన్ విఫలమైందనీ నిరూపించలేకపోయారు. పరీక్ష రాసిన అభ్యర్థులందరి ప్రొవిజనల్ మార్కుల జాబితాను కమిషన్ వెల్లడించి ఉంటే..ఇతర అభ్యర్థుల మార్కులతో పోల్చుకోవడానికి అవకాశం ఉండేదని సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు. అయితే.. ప్రతి అభ్యర్థి లాగిన్ ద్వారా తనకు పేపర్ వారీగా వచ్చిన మార్కులు చూసుకునే అవకాశం ఉంది. తన మార్కుల రీకౌంటింగ్ కోసం.. మరొకరికి కేటాయించిన మార్కులను తెలుసుకోవాలన్నది అనుమతించదగ్గ అంశం కాదు.
తెలుగు అభ్యర్థులకు అన్యాయం ఊహాజనితమే
తెలుగు భాషలో ప్రావీణ్యం ఉన్న మూల్యాంకనదారులు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని సింగిల్ జడ్జి చెబుతున్న దానిలో వాస్తవాలు లేవు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో బోధిస్తున్నారు. అందువల్ల రెండు భాషల్లోనూ మూల్యాంకనం చేయడానికి వారు సమర్థులే. సింగిల్ జడ్జి వాస్తవ ఆధారాలకంటే ఊహాజనితమైన అంశాలపైనే ఎక్కువ ఆధారపడినట్లు కనిపిస్తోంది’’ అని ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.
పరీక్షల రద్దు అనేది వ్యవస్థాపరమైన అక్రమాలు జరిగినప్పుడే జరగాలి. అలాంటి ఆధారాలేవీ లేకుండా.. కేవలం పిటిషనర్లు చేసే ఆరోపణల ఆధారంగా అలాంటి నిర్ణయానికి రాలేం. విస్తృత ప్రజాప్రయోజనాల నేపథ్యంలో ఏకరీతి మూల్యాంకనం అనుసరించిన కారణంగా.. ఏ ఒక్క అభ్యర్థికీ నష్టం వాటిల్లలేదు. ఎలాంటి ఆధారాల్లేకుండా సంజయ్ సింగ్ కేసులో పేర్కొన్నట్లు మోడరేషన్ పద్ధతిలో రీవాల్యుయేషన్ నిర్వహించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలబడవు. మూల్యాంకనం నిమిత్తం కమిషన్ 351 మందిని నియమించింది. అభ్యర్థి గుర్తింపును గోప్యంగా ఉంచి, ఒకరికంటే ఎక్కువ మందితో మూల్యాంకనం జరిపించి మార్కులు కేటాయించినపుడు.. ఎలాంటి ఆధారం లేకుండా..కేవలం ఆరోపణలతో 20 వేల మందికి చెందిన మూల్యాంకన ప్రక్రియను కలుషితం చేయలేం.
హైకోర్టు ధర్మాసనం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

