TRINETHRAM NEWS

జగన్‌ను నమ్మితే మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే: మాజీమంత్రి ప్రత్తిపాటి

సమగ్ర శిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం

జగన్‌ను నమ్మితే ఎవరికైనా చివరకు మిగిలేది కన్నీళ్లు, నిర్వేదమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. తన, పర అన్న బేధం లేకుండా నమ్మి వచ్చిన ప్రతిఒక్కరిని నిండాముంచి, రోడ్లపై వదిలేయడమే అతడికి తెలిసిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. షర్మిల, ఆర్కే, బాలినేని మొదలు ఇటీవల వైకాపా అభ్యర్థిత్వాల ఖరారులో బదిలీలు అయిన వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల కథలే అందుకు నిదర్శనమన్నారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెదేపా శ్రేణులకు జరిగిన సమగ్ర శిక్షణ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, ఓటర్ల జాబితా పరిశీలన, బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ తదితర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సమాయత్తం కావాలని చెప్పారు. ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను చైతన్యం చేసేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.

బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ, ఓటు ఫర్ తెదేపా కార్యక్రమాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి జాబితాలోని లోటుపాట్లను పరిశీలించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ పరంగా ప్రచారాలు, పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా చేసుకుని శ్రేణులంతా శ్రమించాలని కోరారు. బూత్ కన్వీనర్లు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జులు గ్రామ, మండల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. బాగా పనిచేసిన తెదేపా నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులను అభినందించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ జగన్ వ్యక్తిగత, రాజకీయ జీవితాలు రెండింటిలో పదేళ్ల క్రితం దగ్గరగా ఉన్నది ఎవరు, ఇప్పుడు వారెక్కడ ఉన్నారో అన్న ఒక్కటి గమనిస్తే చాలు అతడి విశ్వసనీయత ఏంటో ఇట్టే అర్థమవుతుందన్నారు. నమ్మించి తడిబట్టతో గొంతులుకోసే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి అధికారం ఇచ్చి రాష్ట్ర ప్రజలు కూడా అన్ని విధాలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.