Every officer should perform his duties strictly National SC Commission Members V. Ram Chander
*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి
*సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాం చందర్
పెద్దపల్లి, జిల్లా జూలై -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో ప్రభుత్వ అధికారులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్ అన్నారు.
బుధవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాంచందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , డిసిపి ఎం.చేతన, జాతీయ ఎస్సీ కమీషన్ సంచాలకులు సునీల్ బాబు, రిసేర్చ్ అధికారి డి. వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.
పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులను అదనపు కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను అదనపు కలెక్టర్ వివరించారు.
గత మార్చి నెలలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన సూచనలు, పనుల పురోగతి వివరాలను, తమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, ఈడి ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, పరిశ్రమల శాఖ, లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు.
ఎస్సీ కార్పోరేషన్ క్రింద వివిధ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ నిధులపై రాష్ట్ర స్థాయి ప్రిన్సిపాల్ సెక్రటరీకి లేఖ రాయాలని అన్నారు. పెండింగ్ స్వయం ఉపాధి యూనిట్లు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చూడాలని, గత 4 సంవత్సరాలుగా కులాంతర వివాహాల ప్రోత్సాహకాల పెండింగ్ పై నివేదిక అందించాలని అన్నారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలపై నివేదిక అందించాలని అన్నారు. 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు మంచి గ్రేడ్స్ వచ్చే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.
ఔత్సాహికవేత్తలకు గ్యారెంటీ లేకుండా రుణాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను బ్యాంకులు తూచ తప్పకుండా పాటించేలా చూడాలని అన్నారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన, స్టాండప్ ఇండియా, ముద్రా రుణాలు వ్యాపారవేత్తలకు అందించాలని అన్నారు.
ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని శాఖల వారిగా బ్యాక్ లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ వివరాలను అందించాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్సీలు హత్యకు గురి కాబడితే చట్టం ప్రకారం వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, భూమి మంజూరు చేయాలని అన్నారు. గత 5సంవత్సరాలుగా ఎస్సీ హత్య కేసుల్లో అందించిన పరిహర వివరాలు అందించాలని, నెల రోజుల వ్యవధిలో పెండింగ్ పరిహారం, ఉద్యోగం పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించాలని, అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు.
అనంతరం పాత్రికేయులతో జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాం చందర్ మాట్లాడుతూ,గత 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 జిల్లాలు పర్యటించి ఎస్సి, ఎస్టీలకు రావాల్సిన పథకాలు సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా రివ్యూ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీని పై కమిషన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి 6 కోట్ల పైగా విడుదల అయ్యేలా చేశామని అన్నారు. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని, దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు.
అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, హనుమా నాయక్, పెద్దపల్లి, గోదావరిఖని ఏ.సి.పిలు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App