
Employing Child Labour : హుకుంపేట జూలై 10 (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ప్రచురితమైన వార్తలకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. “బాల కార్మికుల నిర్మూలన మాటలలోనేనా?”, “అల్లూరి జిల్లాలో బాల కార్మికుని వెట్టి చాకిరీ” అనే శీర్షికలతో వెలువడిన వార్తలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తక్షణ విచారణకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం లో బుధవారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐసీపీఎస్, ఐసిడీఎస్, సీడ్స్ సంస్థల ప్రతినిధులతో కూడిన సంయుక్త బృందం పలు చిన్న దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల సందర్భంగా దేవి స్వీట్స్ అండ్ పకోడీ షాపులో 14 సంవత్సరాలు నిండని బాలుడు కార్మికుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బాలుడిని రక్షించి విశాఖపట్నంలోని ఆరిలోవ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడికి అవసరమైన సంరక్షణ, విద్య మరియు పునరావాస సేవలను అందించేందుకు సంబంధిత శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
అలాగే బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్న దుకాణ యజమానిపై బాల కార్మికుల (నిషేధం మరియు నియంత్రణ) చట్టంతో పాటు కనీస వేతనాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లయితే ప్రజలు వెంటనే సంబంధిత శాఖ అధికారులకు లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe