District Collector Koya Harsha said the officers should perform their duties effectively in the mandal
*అవేన్యూ ప్లాంటేషన్ సంరక్షణ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
*జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలో అధికారులకు ప్రభుత్వం కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జూలపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. కనీస విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థికి అందే దిశగా ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
జూలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అర్హులైన ప్రజలకు గ్యారెంటీ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ క్రింద నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జూలపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ ధరణి దరఖాస్తులు, మీసేవ కేంద్రం ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లు మొదలగు వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలో జరుగుతున్న ఎన్.సి.డి సర్వే నాణ్యతను పర్యవేక్షించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జూలపల్లి మండల తహసిల్దార్ స్వర్ణ, ఎంపీడీవో పద్మజ, మండల ప్రత్యేక అధికారి శంకర్, మండల పంచాయతీ అధికారి అనిల్ రెడ్డి, ఏపిఓ సదానందం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App