
దామోదరం సంజీవయ్య జయంతిని అధికారికంగా నిర్ణయించిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్
Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రభుత్వ అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా, ఈ ఉత్సవాలను దామోదరం సంజీవయ్య స్వస్థలమైన కర్నూలు జిల్లాలో రూ. 3 లక్షల నిధులతో నిర్వహించేందుకు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యాలయం సహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో రూ. 1 లక్ష చొప్పున కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
దామోదరం సంజీవయ్య సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడని, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్యా అవకాశాల పెంపుకు, సామాజిక సమానత్వం సాధించడానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. దళిత, పేద, ఉపేక్షిత వర్గాలను సమర్థవంతంగా నడిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అద్భుత పాలన అందించిన నేతకు ఈ గుర్తింపు రావడం గర్వించదగిన విషయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా యువతకు ఆయన జీవితం స్పూర్తిగా నిలుస్తుందని, ప్రభుత్వ విధానాలలో సామాజిక న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం ఎల్లప్పుడూ సామాజిక సమానత్వానికి, పేదల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
