TRINETHRAM NEWS

వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం!

Trinethram News : అమరావతి : రాష్ట్రంలో అందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖను మళ్లీ గాడిన పెట్టి…. పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.

ఉండవల్లిలోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖపై శనివారం సీఎం సమీక్ష చేశారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలసుకునే విధానాన్ని పైలెట్‌గా ప్రారంభించాలని సీఎం నిర్ణయాంచారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డ్ ఇచ్చే విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు.

సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా…సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని సీఎం అన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.

కొత్త అంబులెన్స్‌ల కొనుగోలుకు నిర్ణయం

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్యసేవలు అందించే విషయంపైనా అధికారులతో సీఎం చర్చించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారు.

2020 తరువాత కాల్ సెంటర్‌తో కలిపి ముగ్గురు ఆపరేటర్ల ద్వారా సేవలు అందించారు. ప్రభుత్వం నేడు మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా మూడు సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్స్‌లు ఫిట్‌నెస్ కోల్పోయాయి.

2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉంది. ఇందులో 54 వాహనాలు 5 లక్షల కి.మీ కంటే ఎక్కువ తిరిగి ఉండగా…..65 వాహనాలు 4 లక్షల కి.మీపైగా తిరిగాయి. 71 వాహనాలు 2.5 నుంచి 4 లక్షల కి.మీ తిరిగాయి. వీటిని అన్నింటినీ పూర్తిగా మార్చి కొత్తవాహనాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు.

వీటి కోసం రూ.60 కోట్లు ఖర్చుఅవుతుంది. 104 సర్వీసుల్లో గతంలో ల్యాబ్ టెక్నిషియన్ ఉండేవారు. మైక్రోస్కోప్, స్ర్కీనింగ్ పరీక్షలు చేసేవాళ్లు. రాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అందుబాటులో ఉండేవి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది.

గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్స్‌లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నిషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు.

108 సిబ్బందికి అదనంగా రూ.4 వేలు

108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని…వీరికి జీతంతో కలిపి అందనంగా రూ.4 వేలు చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం రూ.2 వేలు మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి….గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా రూ.4 వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా సీఎం దానికి కూడా అంగీకరించారు. ఇందులో భాగంగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు.

దీనికి యేడాదికి రూ.9.45 కోట్లు అదనంగా ఖర్చు అవనుంది. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. ఆత్మీయులను కోల్పోయి బాధల్లో ఉన్న ప్రజలను పీల్చుకుతినే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిసిఎం సూచించారు.

ఆరోగ్య బీమాతో నాణ్యమైన వైద్య సేవలు

ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్లమందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుంది.

ట్రస్ట్ పద్దతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా…. ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభిచనున్నారు.

పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులు అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

అదే విధంగా జన్ ఔషధి మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App