TRINETHRAM NEWS

CM’s key decision on registrations department

Trinethram News : అమరావతి

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు

సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు

త్వరలో రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ శాఖపై గురువారం నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్ఠంగా 10% నుంచి గరిష్ఠంగా 20% వరకు రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంతవరకు 10% నుంచి 15% మధ్యనే పెంపుదల ఉండొచ్చు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై నిర్ణయాలు జరుగుతాయి. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల వరకు పడుతుంది. పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదించిన తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుంది. ప్రస్తుతం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ విలువలు ఎక్కువగాను, బహిరంగ మార్కెట్‌ విలువలు తక్కువగాను ఉన్నాయి. వీటినీ సరిదిద్దుతారు. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచుతారు. వైకాపా పాలనలో 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10-20%, 2020లో ఎంపికచేసిన పట్టణాల్లో 10-20%, 2022లో జిల్లా కేంద్రాల్లో 20%, 2023లో జాతీయ రహదారులు, ఎంపికచేసిన ప్రదేశాల్లో 20% వరకు విలువలు పెంచారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ శేషగిరిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపునకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలకు ఆదేశాలు వెళ్తాయి.

కార్పొరేట్‌ విధాన ప్రతిపాదనలకు స్వస్తి

ఎంపికచేసిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దే విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికారు. ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో క్రయ, విక్రయదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.10 కోట్లు అవసరమని ఐజీ శేషగిరిరావు ప్రతిపాదించగా విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు.

హడావుడి తప్ప.. స్పందన లేదు

గ్రామ సచివాలయాల్లో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విధానానికి క్రయ, విక్రయదారుల నుంచి స్పందన బాగా తక్కువగా ఉంది. గడిచిన రెండేళ్లలో సుమారు 3,700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా ఇప్పటివరకూ 5,000 రిజిస్ట్రేషన్లే జరిగాయి. వీటివల్ల అదనంగా ఖర్చు, మానవవనరుల వృథాతోపాటు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM's key decision on registrations department