TRINETHRAM NEWS

CM Jagan: అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు..

అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్‌..

ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్టు అభ్యర్థులకు స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జిల మార్పుపై చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు విశ్వరూప్‌, గుమ్మనూరు జయరాం సీఎంను కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై వీరితో సీఎం జగన్‌ చర్చించినట్టు తెలిసింది. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్‌ఛార్జిలను ఖరారు చేస్తున్నారు. పోటీ చేసే స్థానాల విషయమై స్పష్టత ఇస్తున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి తమ సీటుపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది..

గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య ,పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మేల్యే, విప్ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మంత్రి శంకరనారాయణ సీఎంవో కు వచ్చి పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. కొంతమందికి సీటు ఇవ్వడం కుదరదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్లు తెలిసింది. నిన్న ఉభయగోదావరి జిల్లాల నేతలతో చర్చించిన సీఎం.. మంగళవారం మరి కొంతమంది నేతలు, ఆశావహులతోనూ చర్చించారు. రెండు రోజుల్లో పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి..