Trinethram News : హైదరాబాద్
ఆన్‌లైన్ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నేరపరిశోధన, నిందితులను గుర్తించేందుకు ఏడాది పొడవునా దిల్లీ కేంద్రంగా పోలీసు బృందాలను ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది నగర సైబర్‌క్రైమ్ ఠాణాలో 2,735 కేసులు నమోదయ్యాయి. కేవలం 169 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దేశం నలువైపులా విస్తరించిన సైబర్‌నేరస్థుల అడ్డాలను గుర్తించటం, స్థానిక పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకోవటం సవాల్‌గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు దిల్లీలో నాలుగైదు పోలీసు బృందాలను ఉంచనున్నారు. నగరం నుంచి వెళ్లే పోలీసులకు ఆ బృందాలు సహకరిస్తాయి.
ఎందుకీ పరిస్థితి? : నగరంలో ఏటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 16-17 రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లో కూర్చొన్న కేటుగాళ్లు పాన్‌ఇండియా స్థాయిలో మోసాలకు తెగబడుతున్నారు. బాధితులుమోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేసేలోగానే సొత్తు వేర్వేరు ఖాతాల ద్వారా విదేశాలకు చేరుతోంది. సాంకేతికత అందుబాటులో ఉన్నా బ్యాంకు లావాదేవీలను నిలువరించటం దర్యాప్తు బృందాలకు సవాల్‌గామారుతోంది.
●ఇప్పుడేం చేయబోతున్నారంటే..
నగర సైబర్‌క్రైమ్ ఠాణాలో సిబ్బందిని పెంచనున్నారు. కేసు నమోదవగానే నేరస్థులు కాజేసిన నగదును జమచేసిన బ్యాంకు ఖాతాలను గుర్తిస్తారు. చివరకు నగదు ఎవరి వద్దకు చేరుతుందనేది పక్కా ఆధారాలు రాబడతారు. కీలక సూత్రధారులను గుర్తించటం, ఆర్థిక లావాదేవీలను నిలువరించటమే దీని ఉద్దేశమని నగర సీసీఎస్/సిట్ జాయింట్ సీపీ ఎ.వి.రంగనాథ్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు సహకరించేలా సాంకేతిక, న్యాయ బృందాలు దిల్లీలో అందుబాటులో ఉంటాయన్నారు.