TRINETHRAM NEWS

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ‘గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది నాలుగు శాతమే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విద్యపై పెట్టేది ఖర్చులా కాకుండా పెట్టుబడిగా భావించి 10 నుంచి 12 శాతం నిధులు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందేలా వసతులు కల్పిస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వం 6,453 ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేసి.. తండాలు, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న పేదవారికి విద్యను దూరం చేసింది. త్వరలో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం. మూతపడిన పాఠశాలలను తెరిపించి పేద పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యాసంస్థలకు రూ.వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉండటంతో విద్యార్థులు సర్టిఫికెట్లను సైతం తీసుకోలేకపోతున్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. త్వరలో కొడంగల్‌లో మోడల్‌ గురుకుల పాఠశాల ప్రారంభించనున్నాం. 25 ఎకరాల్లో ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలను నిర్మిస్తాం. అన్ని గురుకులాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నాను. దీని వల్ల వారిలో వివక్ష తొలగి సోదరభావం పెరుగుతుంది’ అని రేవంత్‌ వివరించారు.

విపక్ష నాయకులకు ప్రజల సానుభూతి కల్ల..

‘మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే తండ్రీకొడుకులు, అల్లుడు అక్కసుతో మమ్మల్ని తిడుతున్నారు. ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు వారికి సమయం దొరకలేదు. మీకు పాలన చేతకాకపోతే దిగిపొండి.. నేను చేసి చూపిస్తా అని హరీశ్‌రావు అంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఔరంగజేబు తాను రాజయ్యేందుకు తండ్రిని జైల్లో పెట్టి, అన్నను ఉరి తీశాడు. హరీశ్‌రావు కూడా మరో ఔరంగజేబు అవతారమెత్తాలి. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా.. అమరవీరుల స్తూపం వద్ద మీ మెడకు ఉరితాడు కట్టుకొని వేలాడినా మీపై ప్రజలు సానుభూతి చూపించే పరిస్థితి లేదు. నల్లమల అడవుల నుంచి వచ్చిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి కడుపు మండుతోంది’ అని రేవంత్‌ విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి చూపించిన చొరవ కారణంగా చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి ఉద్యోగ నియామక పత్రాలను ఇస్తున్నామన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యా, వైద్యరంగాలను పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు…..