TRINETHRAM NEWS

Celebrate Adivasi Rights Sanghibava Conference to be held on August 9-10

— ఆదివాసి హక్కుల పోరాట సంఘీబావ వేదిక తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ల బాగాస్వామ్య సభ్యులు రషీద్ ద్రావిడ అధ్యక్షతన వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన కరపత్రాల ఆవిష్కరణ.

త్రినేత్రం న్యూస్ జవహర్ నగర్ కాప్రా ప్రతినిధి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
9, 10 ఆగస్టు 2024, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాదులో ఆదివాసి హక్కులు-కార్పొరేటీకరణ సంఘీభావ ఉద్యమాలు అనే అంశాలపై జరిగే అఖిల భారత సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. శనివారం రోజు స్థానిక జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల బాలాజీనగర్ ధక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు, ఆదివాసి హక్కుల సంఘీబావ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ల బాగస్వామ్య సభ్యులు రషీద్ ద్రావిడ అధ్యక్షతన పై కార్యక్రమం జరిగింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, భారత ప్రజలు తమ కోసం తాము రాసుకొని ప్రకటించుకున్న రాజ్యాంగమే ప్రాతినిధ్య ప్రభుత్వాలకు మార్గ దర్శకం కావాలని వెల్లడించారు. చట్టబద్ధ పాలన లేకుండా అసమానతలకు, వివక్షలకు గురవుతున్న ప్రజలకు రక్షణ ఉండదని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగబద్ధ పాలన దిశగా మన సమాజం చాలా సుదీర్ఘ ప్రయాణం చేసినా, ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదని అన్నారు.

అనేక పోరాటాల అనుభవం నుంచి జీవితం ఉన్నతంగా ఎదగాలని, రక్షణ ఉండాలని, మానవీయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, దీని వెనుక వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామిక ఆందోళన ఉన్నదని, ఇందులో భూస్వామ్యానికి వ్యతిరేకంగా పేద రైతులు, కూలీలు చేసిన ఉద్యమాలు ఉన్నాయన్నారు.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా దళిత బహుజనులు చేసిన విముక్తి పోరాటాలు, శ్రమ దోపిడీ నుంచి బైట పడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే కార్మిక పోరాటాలు, అన్ని వర్గాల్లోని, కులాల్లోని, మతాల్లోని స్త్రీలు చేసిన పితృస్వామ్య వ్యతిరేక తిరుగుబాట్లు, అడవిలోకి చొరబడాలనుకున్న మైదాన ప్రాంత రాజ్యాలకు, రాజరికాలకు, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన ఆదివాసీ పోరాటాలు మత ప్రమేయం లేని బహిరంగ జీవితం కావాలనే లౌకిక విలువల కోసం అన్ని మతాల ప్రజలు చేసిన పోరాటాలు, ప్రజా జీవితం నుంచి వచ్చిన ఈ పోరాటాలతోపాటు అద్భుతమైన విలువలను నెలకొల్పాయని గుర్తు చేశారు.
దేశం ప్రజాస్వామిక సమాజంగా మారాలంటే ఈ ఆదర్శాలన్నీ అమలు కావాలని రాజ్యాంగ రచయితలు గట్టిగా అనుకున్నారని పేర్కొన్నారు. దీని కోసం రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఇచ్చి, ప్రభుత్వం ఎట్లా నడుచుకోవాలో ఆదేశిక సూత్రాలను ప్రకటించి, పీడిత సమూహాలు మిగతా ప్రజలతో సమానంగా ఎదగడానికి, చట్టబద్ధ రక్షణ పొందడానికి ప్రత్యేక చట్టాలను తనతో భాగం చేసుకుందని, కానీ ఆదివాసులకు అలాంటి ప్రత్యేక చట్టాలను కల్పించలేదని మండిపడ్డారు.

ముఖ్యంగా పెట్టుబడి ప్రపంచీకరణకు అనుగుణంగా ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను తీసుకొచ్చిన పిమ్మట, అప్పటి నుంచి ప్రజల జీవనోపాధుల విధ్వంసం, నిరుద్యోగం, అధిక ధరల వంటి సమస్యలు తీవ్రమయ్యాయని, ప్రభుత్వం ప్రజలు వదిలేసి మార్కెట్ కోసం పని చేయడం మొదలు పెట్టిందని అన్నారు.
ఈ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముప్పై ఏళ్ల కిందటి ప్రైవేటీకరణ కార్పొరేటీకరణగా విశ్వరూపం ధరించి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోయాయని, ఇంకో పక్క గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరుల మీద కార్పొరేట్ సంస్థల పట్టు బిగించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను పూర్తిగా మార్చేశాయని అన్నారు.

దేశంలోని ఆదివాసీ ప్రాంతాల అడవుల్లోని సహజ వనరులను సొంతం చేసుకోడానికి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వడంతో, ఆదివాసుల అస్తిత్వం సంక్షోభంలో పడిపోయిందని, దీన్నుంచి బైటికి రావడానికి ఆదివాసులు పోరాడుతున్నారని, తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం జీవన్మరణ ఉద్యమాల్లో తలమునకలయ్యారని వెల్లడించారు. వాళ్లను అణచివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మారణకాండకు పాల్పడుతున్నదని, ఇందులో భాగంగా మధ్య భారతదేశంలో గత ఐదారు నెలలుగా వందలాది మంది ఆదివాసులను భారత సైనికులు, పోలీసులు కాల్చేశారని అన్నారు.

అడవిలో ఆదివాసులు ఉన్నంత వరకు అక్కడి వనరులను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసిపోయి, వాళ్లను అక్కడి నుంచి నిర్వాసితులనైనా చేయాలి, లేదా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ కగార్ పేరిట అంతిమ యుద్దాన్ని అటు మావోయిస్టులను, ఇటు ఆదివాసులను ఏకకాలంలో అణిచివేతకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఆదివాసులు చేస్తున్న పోరాటం కేవలం వాళ్ల జీవితానికి, సంస్కృతికి సంబంధించింది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందాల్సిన సహజ సంపద గుప్పెడు మంది కార్పొరేట్ల సొంతం కావడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి వ్యతిరేకం అని అన్నారు.

ఈ అవగాహనతో ఇవాళ దేశ ప్రజలందరూ ఆదివాసుల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. అడవుల్ని కాపాడి, పర్యావరణాన్ని పరిరక్షించుకొని, కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలు రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం అని, ప్రజల సంక్షేమాన్ని వదిలేసి కార్పొరేట్ల కోసం ఆదివాసులను చంపేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ మాట దేశమంతా వినిపించేలా ఎలుగెత్తి చాటవలసి ఉన్నదని అన్నారు.

ఇందులో భాగంగా ఏర్పడ్డ ‘ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక’ అఖిల భారత సదస్సు తలపెట్టిందని, దీన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ఉద్యమకారులను, పర్యావరణ ప్రేమికులను, ప్రజాస్వామికవాదులను,పీడిత ఆదివాసీలను కోరారు. ఈపై కార్యక్రమంలో పిడిఎం చంద్రమౌళి, ఇఫ్టూ షేక్ షావలి, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ప్రవీణ్, ఐ.ఎఫ్.టి.యు. శివబాబు, ఏ.ఐ.ఎఫ్.టి.యు. మల్లేష్, చైతన్య మహిళా సంఘం అల్లూరి సావిత్రి, ఐపిఓడబ్ల్యూ పి.సునిత, ఎం.పుణ్యవతి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ టి.కాలేషా, సైయద్, టివిఐవి మబ్బుబాలు, భారత్ బచావో సోమయ్య తధితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Celebrate Adivasi Rights Sanghibava Conference to be held on August 9-10