TRINETHRAM NEWS

దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్‌

ఖరారైన తుది నిబంధనలు

రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌ పోర్టల్‌

ప్రభుత్వ వర్గాల వెల్లడి

లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే సీఏఏ ప్రకటన

న్యూఢిల్లీ :

లోక్‌సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయిందని, వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా సీఏఏను కేంద్రం అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పౌరసత్వ నమోదు కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ కూడా సిద్ధమైందని, కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ట్రయల్‌ రన్స్‌ నిర్వహించిందని తెలిపాయి. దీర్ఘకాలిక వీసా కోసం హోంశాఖ వద్దకు వచ్చిన దరఖాస్తులకు అధిక శాతం పాకిస్థానీయుల నుంచే వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాంగ్‌టర్మ్‌ వీసాలను మంజూరు చేసే అధికారాన్ని కేంద్రం ఇప్పటికే తొమ్మిది రాష్ర్టాల్లోని 30 జిల్లాల మేజిస్ట్రేట్‌లకు అప్పగించింది*

ఏమిటీ సీఏఏ?

పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019, డిసెంబర్‌లో కేంద్రం తీసుకొచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్‌ 31 కంటే ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్‌ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే సీఏఏ నిబంధనలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు.

అభ్యంతరాలు ఏంటి?

1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ముస్లిం ఆధిపత్య దేశాల్లో మత హింస కారణంగా దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నదని, రాజ్యాంగ లౌకిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మా రాష్ర్టాల్లో అమలు చేయబోం!

పౌరసత్వ సవరణ చట్టాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో సీఏఏను అమలు చేసేది లేదని తమిళనాడు, కేరళ వంటి రాష్ర్టాల సీఎంలు తెగేసి చెబుతున్నారు. సీఏఏను తమిళనాడులో అసలు అమలు చేయబోమని సీఎం ఎంకే స్టాలిన్‌ ఇటీవల స్పష్టంచేశారు. ‘ముస్లింలు, శ్రీలంక తమిళుల గురించి పట్టించుకోకుండా ఈ చట్టాన్ని రూపొందించారు.చట్టాన్ని అమలు చేయబోం’ అని ఆయన పేర్కొన్నారు. సీఏఏను అమలు చేయరాదనే వైఖరికి కేరళ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం విజయన్‌ ఓ సందర్భంగా స్పష్టం చేశారు. భారత్‌ను మతపరమైన దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.