
నేటి సమాజానికి కనువిప్పు కలిగించిన సాంఘిక నాటిక ప్రదర్శన
అద్వితీయ నటన చూపిన సుబ్బారెడ్డి
అనపర్తి : త్రినేత్రం న్యూస్.
మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్న నేటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను చాటి చెబుతూ సందేశాత్మకంగా సాగిన బంధాల బరువెంత నాటిక అధ్యంతం ఆకట్టుకుంది.
పొలమూరు డి ఎన్ ఆర్ గ్రౌండ్స్ లో శ్రీ శారదా కళానికేతన్ ఆధ్వర్యంలో సాంఘిక నాటిక ప్రదర్శన నిర్వహించారు. గ్రామానికి చెందిన సీనియర్ కళాకారుడు తాడి సుబ్బారెడ్డి దర్శకత్వం లో చెలికాని వెంకట్రావు రచించిన ఈ నాటిక లో పాత్రధారులు తమ నటనతో అహుతులను రంజింపజేశారు..
ముఖ్యంగా పార్వతీశం పాత్రలో సుబ్బారెడ్డి నటన నాటికకి మరింత వన్నె తెచ్చింది. ఉమ్మడి కుటుంబంలో కొడుకులు, కోడళ్ళు, మనవలు తో ఆప్యాయంగా జీవించే ఒక ఉమ్మడి కుటుంబంలో చిన్న కోడలు ప్రవర్తన కారణంగా వారు కుటుంబాన్ని వీడి నగరానికి వెళ్లిపోవడం తో నాటిక ఆరంభమవుతుంది. ఈ క్రమంలో తండ్రికి అనారోగ్యం కలగడం, వ్యవసాయం లో నష్టాలు రావడం తో పెద్ద కొడుకు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నా, నగరంలో ఉన్న
చిన్న కోడలు ఏ విధంగా సహాయం చేయకుండా మానవత్వం చూపకపోవడం వంటి సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. తమ్ముడు కష్టాల్లో ఉన్నాడని మరదలు చెప్పిన మాటలకు పొలం అమ్మి డబ్బులు సాయం చేసే అన్నయ్య, చిన్న కోడలు ప్రవర్తన చూసి బాధ పడి ఆమెకు బుద్ధి చెప్పే పాత్రలో ఆమె తండ్రి చేసిన ప్రయత్నం అందరూ కలిసి ఉండటం వల్ల మానవీయ బంధాలు మరింత బలపడతాయని సందేశాన్ని అందించింది నాటిక..
పార్వతీశం పాత్రలో తాడి సుబ్బారెడ్డి, పార్ధసారధిగా చేవలి శ్రీనివాస్,జనార్దన్ గా కే. రామారెడ్డి, రైతుగా పి. శ్రీనివాసరావు, శివరావు గా సత్తిబాబు,సీతగా టి. శ్రీలేఖ, పావని గా ఎస్, సుజాత రెడ్డి తమ పాత్రలకు జీవం పోశారు. ప్రదర్శనను సొసైటీ మాజీ ఛైర్మెన్ సత్తి వీర రాఘవరెడ్డి, మల్లిడి నాగిరెడ్డి పర్యవేక్షించగా, తాడి శ్రీనివాస్ రెడ్డి, తాడి నాగిరెడ్డి, తాడి సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి కొండబాబు సహకారం అందించారు. అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
