TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి :
ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆయన విద్యార్ధులకు హాల్‌టికెట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్టీ, ఎఫ్‌ఎల్‌ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్‌ఎఫ్‌ఈ, శామో, టోఫెల్‌ నిర్వహణ తదితర విభాగాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్‌’ వంటి యాప్స్‌ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీణ్‌ ప్రకాశ్‌ అధికారులను ఆదేశించారు.

విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్‌ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్‌ మెసేజ్‌లను అనువాదం చేసుకోవచ్చని అన్నారు. డిజీ లాకర్‌ యాప్‌ ద్వారా ఫార్మెటివ్‌ సమ్మేటివ్‌ పరీక్షల మార్కులను తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజమాన్య పాఠశాలలను ఎస్‌సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని అన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు పాఠశాలలను పరిశీలిస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును వారు అధ్యయనం చేస్తాయని అన్నారు.