TRINETHRAM NEWS

Trinethram News : ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం సమస్య అంతమొందాలంటే కనీసం మరో 200 ఏండ్లకు పైగా సమయం అవసరమని ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలో ఐదుగురు అత్యంత కుబేరుల సంపద 2020 నుంచి రెట్టింపు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడ్డారని ఈ నివేదిక తెలిపింది. ఇవే ధోరణులు కొనసాగితే రానున్న 230 ఏండ్లలో పేదరికాన్ని రూపుమాపడం సంక్లిష్టమైన ప్రక్రియగా మారుతుందని పేర్కొంది.

అత్యంత ధనికుల చేతిలో కార్పొరేట్ యాజమాన్యాలు బందీ కావడం ఆందోళన రేకెత్తిస్తోందని తెలిపింది. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో అసమానతలు పెరిగాయని ఆర్ధిక శక్తి కేంద్రీకరణ విచారకరమని నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం ప్రపంచంలో 1 శాతం అత్యంత సంపన్న వర్గం గుప్పిట్లోనే మగ్గుతున్నాయని పేర్కొంది. అదేమాదిరిగా మద్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లోనూ ఇదే తరహా అసమానతలున్నాయని నివేదిక తెలిపింది. సంపన్న వర్గమైన ఒక శాతం చేతిలో 47 నుంచి 50 శాతం ఆస్తులున్నాయని వెల్లడించింది.

ప్రపంచంలో 50 అతిపెద్ద పబ్లిక్ కార్పొరేషన్స్‌లో 34 శాతం సంస్ధలకు బిలియనీర్ సీఈవో లేదా బిలియనీర్ ప్రధాన వాటాదారుగా ఉన్నారని ఆక్స్‌ఫాం పరిశోధన తెలిపింది. ఈ కార్పొరేషన్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 13.3 ట్రిలియన్ డాలర్లని వివరించింది. ప్రపంచ సంపదలో అసనమానతలు పెరిగిన క్రమంలో పేదరికాన్ని తగ్గించేందుకు, అందరికీ సమాన అవకాశాలు కలిగిన భవిష్యత్ కోసం వ్యవస్ధాగత మార్పులు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది. కొద్దిమంది కోసం కాకుండా అందరి ప్రయోజనాలకు అద్దం పట్టే ఆర్ధిక వ్యవస్ధలను పరుగులు పెట్టించేందుకు కీలక అడుగులు పడాల్సిన అవసరం ఉందని ఆక్స్‌ఫాం నివేదిక స్పష్టం చేస్తోంది.