TRINETHRAM NEWS

భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా దీన్ని తయారు చేశారు. కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్‌కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భద్రాద్రిలో ఇకపై శుక్రవారం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ రోజు మూల విరాట్‌కు స్వర్ణ కవచాల అలంకరణ ఉంటుంది. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు. ఇప్పుడు శని, ఆదివారాల్లో రద్దీ నెలకొంటోంది. భవిష్యత్తులో శుక్రవారం కూడా సందడి పెరిగే అవకాశముంది.