
హైదరాబాద్: సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో.. వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో.. రాష్ట్రంలోనూ ఇదే తరహా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. 11న ఆదివారం సెలవు. తిరిగి 12 నుంచి బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమవుతాయి.
