A brighter future for children with better academic teaching in government schools
పెద్దపల్లి, జూన్ -06 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు
గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు
జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు కంటే మెరుగైన నాణ్యత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెబుతారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందని, బట్టిపట్టే విధానం కాకుండా పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమయ్యే దిశగా వారికి వివరిస్తూ కొత్త బోధనా పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని అన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని, దీని ఫలితంగా ఇటీవలే వచ్చిన పదవ తరగతి ఫలితాల్లో జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను సాధిస్తున్నామని , ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ గా ప్రతి నెల పేరెంట్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నా మని, విద్యార్థుల పురోగతే లక్ష్యంగా ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేయడం జరుగుతుందని అన్నారు
ప్రపంచంలోనీ అనేక దేశాలు విఫలమైన చంద్రయాన్ ప్రయోగాన్ని మన భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని, అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు
ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు
అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలల్లోని విద్యార్థులతో సంభాషిస్తూ వారు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు
కార్యక్రమంలో పాల్గొన్న *జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి మాట్లాడుతూ జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు
విద్యార్థులకు ముఖ్యమైన పాఠ్యాంశాలను వివరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ కార్నర్లను ఏర్పాటు చేశామని, గ్రంథాలయంలో విద్యార్థుల కోసం మంచి కథల పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని, అనవసరంగా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చి డబ్బు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఐఐటి, నీట్ ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నా రని, క్రీడా పోటీలలో సైతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధికంగా రాణిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు
కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల అకడమిక్ అధికారి డాక్టర్ పి.ఎం. షేక్ మాట్లాడుతూ, పెద్ద బొంకూర్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు, ఆట స్థలం అందుబాటులో ఉన్నాయని, మంచి నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందంచే బోధన చేస్తున్నారని, వీటిని వినియోగించుకుంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దబొంకూర్ జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. సుదర్శన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, రెండు జతల స్కూల్ యూనిఫామ్స్, రుచికరమైన మధ్యాహ్న భోజనం, అనుభవం కలిగిన ఉపాధ్యాయు లచే బోధన, 6 నుంచి 10వ తరగతి లకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని అన్నారు
గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహించి ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే దిశగా అవసరమైన కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వ్యక్తిగతంగా వారి అభివృద్ధికి పర్యవేక్షిస్తామని, విద్యార్థులు శారీరకంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాలలో క్రీడా ప్రాంగణం అందుబాటులో ఉందని, పాఠశాలల్లో అవసరమైన ప్రయోగశాల, ఐ.ఎఫ్.పి ద్వారా డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నామని అన్నారు
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్నవిద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సమత, అడిషనల్ డిఆర్డిఓ రవికుమార్, ఏపీఎం సంపత్, అంగన్వాడీ టీచర్స్ సుధా, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App