సంచలన తీర్పు….పదమూడేళ్ల అమ్మాయి.. పాతికేళ్ల అబ్బాయి.. ఇద్దరి సాన్నిహిత్యం ప్రేమేనని తేల్చిన బాంబే కోర్టు
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ మంజూరు
మైనర్ స్టేట్ మెంట్ ఆధారంగా అత్యాచారం కాదని తెలుస్తోందంటూ వ్యాఖ్య
బంగారం నగలతో వచ్చిన బాలికను తీసుకొని వేరే నగరంలో యువకుడి నివాసం
బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని ట్రేస్ చేసిన పోలీసులు
పదమూడేళ్ల అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయి పాతికేళ్ల వయసున్నప్రియుడితో కలిసి ఉంటోంది.. తన కూతురు మైనర్ అని, ఆమెపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అయితే, బాధితురాలు, నిందితుడి మధ్య జరిగిందంతా ప్రేమతోనే తప్ప కామంతో కాదని పేర్కొంటూ కోర్టు ఆ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. వారిది లవ్ ఎఫైర్ మాత్రమేనని, అత్యాచారం కాదని తేల్చింది. బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.
కేసు వివరాలివీ..
మహారాష్ట్రకు చెందిన ఓ పదమూడేళ్ల బాలిక తన ప్రియుడు నితిన్ ధాబేరావ్ (26) తో కలిసి పారిపోయింది. పుస్తకాలు కొనుక్కోవాలని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోయేసరికి తండ్రి ఊరంతా గాలించాడు. తన కూతురును నితిన్ తీసుకెళ్లిపోయాడని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నితిన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పిల్లలపై లైంగిక నేరాలను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక చట్టమే పోక్సో.. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో బెయిల్ కూడా దొరకదు. ఈ కేసులో బాధితురాలి కోసం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని మహారాష్ట్రకు తరలించారు.
నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుడు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా నిందితుడి వాదనను, బాధితురాలి స్టేట్ మెంట్ ను పరిశీలించిన జస్టిస్ ఊర్మిళ జోషి ఫాల్కే బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరి మధ్య ఉన్నది లవ్ ఎఫైర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లిన దాఖాలాలు కానీ, నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు గానీ ఎక్కడా లేదని జడ్జి పేర్కొన్నారు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమతోనే ఇద్దరూ కలిసి ఉన్నారని, దీనిని లైంగిక దాడిగా పరిగణించలేమని చెబుతూ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.