TRINETHRAM NEWS

పెన్షనర్లకు పెద్ద బహుమతి – దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్‌ నుంచయినా పెన్షన్‌

Trinethram News : CPPSతో ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం ఉండదని, పింఛను సేవల్లో కొత్త కొలమానాన్ని సృష్టించినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.

కోట్లాది మంది EPFO చందాదారులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన నూతన సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో పెన్షనర్లకు పెద్ద బహుమతి దొరికింది. దేశంలోని EPFO అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (Centralized Pension Payments System – CPPS) పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈ పని డిసెంబర్ 2024 నాటికి పూర్తయింది. డిసెంబర్ 2024 నాటికి, 68 లక్షల మందికి పైగా ఉన్న EPS పెన్షనర్లకు సుమారు రూ.1570 కోట్ల విలువైన పెన్షన్ పంపిణీ జరిగింది.

దేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్‌

సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌ సంపూర్ణంగా అమల్లోకి రావడంతో, పింఛనర్లు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా, ఏ బ్యాంక్‌ నుంచయినా, ఏ శాఖ నుంచయినా తమ పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత స్వగ్రామాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, పెన్షన్‌ తీసుకునే సమయానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో, ఇప్పుడు EPFO పెన్షనర్లు దేశంలోని ఏదైనా ప్రాంతీయ EPFO కార్యాలయం నుంచి అయినా పెన్షన్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు.

దేశంలోని మొత్తం 122 ప్రాంతీయ EPFO కార్యాలయాల్లో కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ (PPO)ను బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉండదు. CPPS వల్ల, పింఛను విడుదలైన వెంటనే ఆ డబ్బు పెన్షనర్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది.

కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ EPFO సేవలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పెన్షనర్లకు ఆధునిక సౌకర్యాలు అందించడంతో పాటు పారదర్శకత పెంచడంలో NDA ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్ర కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్వీట్‌ చేశారు.

రెండు పైలెట్‌ ప్రాజెక్ట్‌లు విజయవంతం

CPPS మొదటి పైలట్ ప్రాజెక్ట్ 2024 అక్టోబర్‌లో జమ్ము, కర్నాల్, శ్రీనగర్ ప్రాంతీయ కార్యాలయాలలో విజయవంతంగా పూర్తయింది. ఇందులో భాగంగా, 49,000 మంది ఈపీఎస్ పెన్షనర్లకు రూ. 11 కోట్ల పింఛను పంపిణీ చేశారు. రెండో ప్రయోగాత్మక కార్యక్రమం దేశంలోని 24 ప్రాంతీయ కార్యాలయాల్లో విజయవంతంగా పూర్తయింది. ఈ 24 స్థానిక కార్యాలయాల ద్వారా 9.3 లక్షల మందికి రూ. 213 కోట్ల విలువైన పెన్షన్ అందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App