
ఎగుమతుల దిశగా ముందడుగు వేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి.
Kadiyam Nurseries : త్రినేత్రం న్యూస్, అందమైన పూలు, అలంకరణ మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ రైతులు అంతర్జాతీయ అవకాశాలను, అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ ఫార్మర్స్ భవనంలో నర్సరీ అసోసియేషన్, ఉద్యాన శాఖ సంయుక్తంగా నిర్వహించిన కడియం నర్సరీ నుండి ఎగుమతికి గల అవకాశాలు, వ్యూహాలపై వర్క్‌షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడియం నర్సరీలకు జాతీయ స్థాయిలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అలాంటి పరిస్థితుల్లో ఎగుమతుల దిశగా మరింత చొరవ చూపాలని రైతులకు సూచించారు. దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి కోట్ల రూపాయల విలువైన మొక్కలు విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ, ఎంతో పేరెన్నికగన్న కడియం నుంచి తక్కువ స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్లనే రైతులు అంతర్జాతీయ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 10 నర్సరీ సంస్థలు మాత్రమే ఎగుమతి లైసెన్సులు కలిగి ఉన్నాయని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల మార్కెటింగ్ విధానాలు, ఎగుమతి అవకాశాలపై అవగాహన పెంపొందించుకుంటే రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు.
నర్సరీ రైతులు గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఈ దిశగా ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాన్ని సత్యనారాయణ, పంతం గణపతి, అన్నందేవుల చంటి, మార్గాన్ని ఏడుకొండలు, సురపురెడ్డి బాబి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, ఎపెడా ప్రతినిధి సుఖేష్, ప్రాంతీయ పూల పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్ రాజు, సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె కమలాకర్ బాబు, కడియం హార్టికల్చర్ హెచ్ఓ సుధీర్ కుమార్, గాదా నాగేశ్వరరావు, కుప్పాల దుర్గారావు, పుల్లా రామారావు, బోడపాటి గోపి, తాసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో రమేష్, పలువురు నర్సరీ అసోసియేషన్ సభ్యులు, హార్టికల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

