Illegal Arrests of Students : విద్యార్థులపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు

TRINETHRAM NEWS
Illegal arrests of students

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి

విద్యాశాఖకు మంత్రి కేటాయించాలి

పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ ఆగ్రహం

Illegal Arrests of Students : త్రినేత్రం న్యూస్/ షాద్నగర్ ప్రతినిధి.. విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన “చలో అసెంబ్లీ” ముట్టడిని అడ్డుకోవడం మరియు విద్యార్థి నేతలను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని AISF రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
​నేడు హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకాష్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కేవలం విద్యారంగంపై బడ్జెట్ కేటాయింపులను నిరసించినందుకే విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు.
​ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి సాక్ష్యం. పోలీసుల లాఠీలకు, అరెస్టులకు విద్యార్థి లోకం భయపడదని.. విద్యారంగం పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతిఘటించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులందరినీ వెంటనే విడుదల చేయాలని, అలాగే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
​విద్యార్థి శక్తిని అణచివేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని, బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆకాష్ నాయక్ హెచ్చరించారు. ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ నాయక్, ప్రకాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top