Bal Dev : ఉప ముఖ్యమంత్రి పాడేరు రాకముందే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీఓలు రద్దు చేయాలి ఆదివాసీ గిరిజన సంఘం బాల్ దేవ్

TRINETHRAM NEWS

అరకులోయ మార్చి 14, (త్రినేత్రం న్యూస్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆదివాసుల జీవితాలకు ముప్పుగా మారనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్లు 2, 13, 51లను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలలో 100 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని సంఘం కోరింది.
అరకువేలి గిరిజన సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలాదేవ్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, అరకువేలి, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల పరిధిలో గుజ్జెలి, చిట్టంవలస, పెదకోట, ఎర్రవరం, సీలేరు ప్రాంతాల్లో సుమారు 6100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను నవయుగ, అదాని, శిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ వంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా ఆదివాసుల హక్కులు, చట్టాలు ఉల్లంఘించబడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ అమలులోకి వస్తే 25 పంచాయితీలు, 250 గ్రామాలు, సుమారు 60 వేల మంది ఆదివాసులు తీవ్రంగా ప్రభావితమవుతారని, వేల ఎకరాల జిరాయితి, అటవీ భూములు, కాఫీ తోటలు, వన్యప్రాణులు జల సమాధి అవుతాయని తెలిపారు.
అందువల్ల ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్లు 2, 13, 51లను తక్షణమే రద్దు చేస్తూ ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెగా డీఎస్సీలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు 100 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇప్పటివరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల సుమారు 4500 ఉపాధ్యాయ పోస్టులు ఆదివాసులు కోల్పోయారని పేర్కొన్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే సుమారు 92 శాతం ఉపాధ్యాయ పోస్టులు నాన్-లోకల్ అభ్యర్థులతో భర్తీ అయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం 2026 డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, టెట్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అయితే 100 శాతం రిజర్వేషన్ పై ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ఆదివాసీ యువతలో తీవ్ర నిరసన, నిరాశ నెలకొన్నాయని చెప్పారు.
కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం 100 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను జనరల్ డీఎస్సీలో విలీనం చేయవద్దని కోరారు.
ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, మండల ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ బురిడీ దశరథ్ తదితరులు పాల్గొన్నారు

Hydropower project GOs should be cancelled before Deputy Chief Minister

You cannot copy content of this page

Scroll to Top