త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణా మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ జారీ చేసిన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా కేవలం జనవరి నెలలోనే జిల్లా వ్యాప్తంగా మొత్తం 22 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో ప్రధానంగా సహజ వనరుల దోపిడీని అరికట్టే క్రమంలో, అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై 14 కేసులు, అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టరుపై ఒక కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
పర్యావరణానికి మరియు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి 4 కేసులు నమోదు చేశామని ఆమె వివరించారు.
అక్రమ రవాణానే కాకుండా సామాజిక రుగ్మతలపై కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు గట్టి నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పేకాట స్థావరాలపై దాడులు చేసి ఒక కేసు, మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద ఒక కేసు, మరియు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార పదార్థాల విక్రయదారులపై ఒక కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఇదే విధంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా చట్టవ్యతిరేక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలియజేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


