Trinethram News : తెలంగాణ రాష్ట్ర వాహన కొనుగోలుదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అమలులోకి వచ్చింది. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యే నూతన విధానం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ విధానం అమలుతో వాహనదారులకు భారీ ఊరట లభించనుంది.
జనవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానంపై విధానపరమైన నిర్ణయం తీసుకోగా, రవాణాశాఖ అధికారులు ఇందుకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు, సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా, అది పూర్తిగా విజయవంతమైంది.
ఈ సందర్భంగా ఫోర్ వీలర్ కొనుగోలు చేసిన వాహనదారుడికి సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ స్వయంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పత్రాలను అందజేశారు. నూతన ఆన్‌లైన్ విధానం ద్వారా డీలర్ పాయింట్‌లోనే రిజిస్ట్రేషన్ పూర్తి కావడం గమనార్హం.
కొత్త విధానం అమలుతో ఇకపై వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. వాహనం విక్రయించిన డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణాశాఖ అధికారులు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు.
అధికారుల వివరాల ప్రకారం, ఉదయం వాహనం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. సాయంత్రం కొనుగోలు చేసిన వాహనాలకు మరుసటి రోజు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహన యజమానికి పంపించబడుతుంది.
ఈ నూతన విధానం ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం గతంలో మాదిరిగానే ఆర్టీఓ కార్యాలయాల్లోనే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే డీలర్ల షోరూమ్‌లలో తనిఖీలు నిర్వహించి ప్రక్రియను పర్యవేక్షిస్తామని తెలిపారు.
నూతన విధానం అమలుపై రవాణాశాఖ కమిషనర్ రాష్ట్రంలోని 33 జిల్లాల రవాణా అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి పూర్తి అవగాహన కల్పించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, డిజిటల్ పాలన దిశగా ఇది ఒక కీలక ముందడుగని అధికారులు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


