Mini India in Davos : దావోస్‌లో మినీ ఇండియా – రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ

TRINETHRAM NEWS

Trinethram News : స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ఈసారి సరికొత్త రికార్డులకు వేదికైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి ఏకంగా పది రాష్ట్రాలు తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేసి, ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కీలక మంత్రులు ఈ అంతర్జాతీయ వేదికపై తమ రాష్ట్రాల బలాబలాలను, వనరులను వివరిస్తున్నారు.

రాష్ట్రాల ప్లస్ పాయింట్లతో మార్కెటింగ్

సాధారణంగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో ఉన్న వారితోనే కాకుండా, అసలు భారత్ వైపు చూడని అంతర్జాతీయ సంస్థలకు కూడా రాష్ట్రాల ప్రతినిధులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మీ వ్యాపార విస్తరణకు మా రాష్ట్రం ఎలా వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుస్తుంది అనే అంశంపై ప్రతినిధులు చేస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పారిశ్రామిక వేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రపంచ దిగ్గజాలతో ముఖాముఖి చర్చిస్తున్నాయి.

రాష్ట్రాల మధ్య పోటీ – దేశానికి మేలు

ఈ సదస్సులో కనిపిస్తున్న ప్రధాన మార్పు ఏమిటంటే.. రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీ . ఒక రాష్ట్రం కంటే మరో రాష్ట్రం మెరుగైన రాయితీలు, మౌలిక సదుపాయాలు, పారదర్శకమైన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పోటీ వల్ల అంతిమంగా లబ్ధి పొందేది భారత దేశమే. ఏ రాష్ట్రానికి పెట్టుబడి వచ్చినా, అది దేశ జీడీపీకి, ఉద్యోగ కల్పనకు దోహదపడుతుంది. ఈ క్రమంలో ఏర్పడిన ఇన్వెస్ట్‌మెంట్ ఎకోసిస్టమ్ వల్ల భారత్ ఒక గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవాశం ఉంది.

దావోస్‌లో ఇండియా పవర్

భారత రాష్ట్రాల ప్రతినిధులు కేవలం తమ రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఒక టీమ్ ఇండియాగా కూడా అక్కడ ముద్ర వేస్తున్నారు. పది పెవిలియన్లు పక్కపక్కనే ఉండటం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు భారత్‌లో ఉన్న వైవిధ్యం, అవకాశాల వెల్లువ ఒకే చోట కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో మన రాష్ట్రాలు చూపుతున్న తెగింపును చూసి ప్రపంచం విస్తుపోతోంది. దావోస్ గడ్డపై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భారతీయ రాష్ట్రాలు చేస్తున్న ఈ పోరాటం, రాబోయే ఐదేళ్లలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mini India in Davos

You cannot copy content of this page

Scroll to Top